Jasprit Bumrah: టీమిండియాకు శుభవార్త.. బౌలింగ్ చేసేందుకు బుమ్రాకు గ్రీన్ సిగ్నల్!

Jasprit Bumrah: Jasprit Bumrah Cleared Fitness Test. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట దక్కింది.

Rishvik
Published on: 1 Aug 2026 3:44 PM IST
Jasprit Bumrah
X

Jasprit Bumrah: టీమిండియాకు శుభవార్త.. బౌలింగ్ చేసేందుకు బుమ్రాకు గ్రీన్ సిగ్నల్!

Jasprit Bumrah: శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసి.. టెస్టు సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రా ఫుల్‌ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గాయపడిన బుమ్రాను బీసీసీఐ సెలెక్టర్లు శ్రీలంక కోసం ప్రకటించిన జట్టులో చోటిచ్చారు. అయితే ఫిట్‌నెస్‌ టెస్ట్ పాస్ అయితేనే తుది జట్టులో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. తాజాగా సీఓఈ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో అతడి ఎంపికకు మార్గం సుగమమైంది.

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా గాయానికి (గాయం తిరగబెట్టింది) గురయ్యాడు. గాయం కారణంగా మూడో వన్డేకు అతడు దూరం కాగా.. టీమిండియా ఓడిపోయింది. అనుభవం లేని భారత పేస్‌ దళంపై ఇంగ్లీష్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి బుమ్రా కోలుకునే ప్రక్రియలో ఉన్నాడు. తాజాగా అతడు పూర్తిగా కోలుకున్నాడని, అవసరమైన అన్ని ఫిట్‌నెస్ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 'బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించిన అన్ని ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. జట్టు ప్రణాళికల్లో ఇప్పుడు బుమ్రా కీలక ఆటగాడు. రెండు టెస్టుల్లోనూ అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ప్రస్తుత సైకిల్‌లో భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన తొమ్మిది టెస్టుల్లో కనీసం ఎనిమిది విజయాలు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రా వంటి సెనైర్ పేసర్ అందుబాటులో ఉండడం భారత జట్టుకు బలంగా మారనుంది. ముఖ్యంగా శ్రీలంక పిచ్‌లపై స్పిన్నర్లతో పాటు పేసర్ల పాత్ర కూడా కీలకం కావడంతో బుమ్రాపై జట్టు యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది. టెస్టు సిరీస్‌లో బుమ్రా ఆడటం భారత జట్టుకు అత్యంత కీలకం. ఎందుకంటే లంకలో స్పిన్ పిచెస్ కాబట్టి ఇద్దరు ప్రధాన పేసర్లు మాత్రమే తుది జట్టులో ఉండనున్నారు. బుమ్రా ఉంటే లంక బ్యాటర్లు హడలెత్తడం ఖాయం.

భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనున్న భారత జట్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్ తదితరులు చోటు దక్కించుకున్నారు. బుమ్రా ఫిట్‌గా జట్టులో చేరడంతో.. శ్రీలంక పర్యటనను విజయంతో ప్రారంభించాలని గిల్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.

భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story