Jasprit Bumrah: బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు.. జాగ్రత్తగా చూసుకోవాలి!

Glenn McGrath says Jasprit Bumrah is still a spring chicken. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయాలు, ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 29 July 2026 7:31 PM IST
Jasprit Bumrah
X

Jasprit Bumrah: బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు.. జాగ్రత్తగా చూసుకోవాలి!

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయాలు, ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ పర్యటనలో మోకాలి గాయానికి గురైన బుమ్రా.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆగస్ట్ 15 నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు బుమ్రాను భారత జట్టులో ఎంపిక చేసినప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే అతని తుది ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 31-32 ఏళ్ల వయసులో ఉన్న బుమ్రా ఇంకా 'స్ప్రింగ్ చికెన్' లాంటి యువ ఆటగాడేనని పేర్కొన్నాడు. బుమ్రా ఇంకా చిన్నవాడే అని, అతడు తన కెరీర్‌ను మరింత కాలం కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించాడు. 'బుమ్రాది ఇప్పటికీ చిన్న వయసే. అతను ఏం చేయాలనుకుంటున్నాడో అదే ముఖ్యమైన విషయం. టెస్టు క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాడా? లేక టీ20లకే పరిమితం కావాలనుకుంటున్నాడా? అన్నది అతని నిర్ణయం' అని మెక్‌గ్రాత్ సూచించాడు.

'అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా శరీరం ఎలా సహకరిస్తుందన్నది కూడా కీలకం. బుమ్రా బౌలింగ్ యాక్షన్‌లో చేయి ఎక్కువగా వెనక్కి వంగడం వల్ల మోచేయి, కీళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. అందుకే భవిష్యత్తులో అతడు తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది' అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు గాయాలు సహజమేనని చెప్పిన మెక్‌గ్రాత్.. తరచుగా విశ్రాంతి ఇవ్వడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడ్డాడు. 'ఫాస్ట్ బౌలింగ్ అనేది సహజమైన శరీర కదలిక కాదు. అందుకే గాయాలు కావడం సాధారణం. అయితే ఇప్పుడు బౌలర్లను ఎక్కువగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నెలల తరబడి పునరావాస కార్యక్రమాల్లో ఉంచడం వల్ల వారి ఫిట్‌నెస్, బలం తగ్గిపోతాయి. ఆ తర్వాత మళ్లీ పూర్తి స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. బౌలర్లు గాయాలకు భయపడకుండా శరీరాన్ని మరింత బలంగా తయారు చేసుకోవడమే ఉత్తమ మార్గం' అని సూచించాడు.

తాజాగా జరిగిన ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో గ్లెన్ మెక్‌గ్రాత్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా గాయాలపై ప్రశ్నలు ఎదురు కాగా.. మెక్‌గ్రాత్ పై వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా త్వరగా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి శ్రీలంక టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగాలని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్ జట్టుపై రెండు వన్డేల్లో బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేదు. రెండు మ్యాచులలో రెండు వికెట్స్ మాత్రమే పడగొట్టాడు. 19 ఓవర్లలో 4 ఎకానమీ రేటుతో రన్స్ ఇచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story