Jasprit Bumrah: బుమ్రా ఒక్కడినే నిందించడం తగునా?.. ముంబై ఇండియన్స్ మిగతా ఆటగాళ్లకు బాధ్యత లేదా?
Jasprit Bumrah: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) పేలవ ప్రదర్శన చేస్తోంది.
Jasprit Bumrah
Jasprit Bumrah: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించి తీవ్ర ఒత్తిడిలో ఉంది. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది. ఐపీఎల్ 2026లో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమవడం ముంబైకి పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రధాన బౌలర్, టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా బౌలింగ్‌ను యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఉతికేయడంతో కూడా అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే బుమ్రాను పూర్తిగా తప్పుబట్టడం సరైంది కాదని చెప్పాలి.
జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ రేట్ 8.20తో ముంబై జట్టులోనే ఉత్తమంగా ఉంది. అంటే పరుగులను నియంత్రించడంలో అతడు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ వికెట్లు పడగొట్టడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీసుకోకపోవడం అతని ప్రదర్శనపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. టి20 ఫార్మాట్‌లో వికెట్లు పడగొట్టడం ఎంతో కీలకం. వికెట్లు పడకపోతే ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్లు చేయడం సులభమవుతుంది. బుమ్రా పరుగులను నియంత్రిస్తున్నప్పటికీ.. కీలక సమయంలో వికెట్లు తీయకపోవడం ముంబైకి పెద్ద మైనస్‌గా మారింది. ప్రత్యర్థి జట్లు బుమ్రాను జాగ్రత్తగా ఎదుర్కొని.. మిగతా బౌలర్లపై దాడి చేస్తున్నాయి.
ముంబై బౌలింగ్ విభాగంలో మరో సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ మూడు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్ తీసి ఏకంగా 110 పరుగులు ఇచ్చాడు. దీపక్ చహర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. శార్దుల్ ఠాకూర్ ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ.. ఓవరుకు 13 పరుగులకు పైగా ఇస్తున్నాడు. మొత్తం జట్టుగా చూస్తే ముంబై బౌలర్లు ఓవరుకు 11 పరుగులకు పైగా ఇస్తున్నారు. మిడిల్ ఓవర్లలో (7-16) ముంబై బౌలింగ్ దారుణంగా ఉంది. బౌలర్లు ఓవరుకు 11.14 పరుగులు ఇచ్చి.. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశారు. టోర్నమెంట్‌లో ఇదే అత్యంత చెత్త ప్రదర్శనగా నిలిచింది. ఇక్కడే ముంబై వెనుకబడుతోంది. ముంబై ఓటములకు బుమ్రానే కారణమని చెప్పడం తగదు. కానీ జట్టు ప్రధాన బౌలర్‌గా అతనిపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. కేవలం పరుగులు నియంత్రించడం కాకుండా.. వికెట్లు పడగొట్టేందుకు వ్యూహాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
జస్ప్రీత్ బుమ్రా గత 5 ఇన్నింగ్స్‌ల్లో 19 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 163 పరుగులు ఇచ్చాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నారు. అతన్ని కట్టడి చేస్తే మిగతా బౌలర్లపై సులభంగా పరుగులు సాధించవచ్చనే ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నారు. మళ్లీ బ్యాటర్లలో భయం కలిగించేలా బుమ్రా ప్రదర్శన మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముంబై ఇండియన్స్ తిరిగి గెలుపు బాట పట్టాలంటే.. బౌలింగ్ విభాగం మొత్తం మెరుగుపడటం ఎంతో కీలకం.




