Jasprit Bumrah: బౌలింగ్ మార్కర్‌ను తన్నిన బుమ్రా.. వైరల్ వీడియో!
Jasprit Bumrah: ఐపీఎల్ 2026 సీజన్‌లో మాత్రం బుమ్రా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. బౌలింగ్ మార్కర్‌ను తన్నడం, మైదానంలో గట్టిగా అరవడం లాంటివి చేశాడు.
Jasprit Bumrah: బౌలింగ్ మార్కర్‌ను తన్నిన బుమ్రా.. వైరల్ వీడియో!
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత యార్కర్లతో టాప్ బ్యాటర్లను కూడా ఈజీగా బోల్తా కొట్టిస్తుంటాడు. కొన్నిసార్లు బుమ్రాను బ్యాటర్లు ఆడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తన బౌలింగ్‌లో బ్యాటర్ సిక్స్, ఫోర్ కొట్టినా.. ఓ చిరునవ్వి నవ్వి వదిలేస్తాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో మాత్రం బుమ్రా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. బౌలింగ్ మార్కర్‌ను తన్నడం, మైదానంలో గట్టిగా అరవడం లాంటివి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్ 2026 సీజన్‌లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ అయిన బుమ్రా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయలేదు. 5 మ్యాచ్‌లలో ఒక్క వికెట్ లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా ముంబై కూడా వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చినా వికెట్ మాత్రం దక్కలేదు. దాంతో ఓ సమయంలో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. బౌలింగ్ మార్కర్‌ను తీసి విసిరేయడం, తర్వాత కిందికి వంగి అరవడం వంటివి చేశాడు. ఈ దృశ్యాలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే బుమ్రా.. ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం అరుదైన విషయం కావడంతో నెట్టింట చర్చనీయాంశమైంది.
జస్ప్రీత్ బుమ్రా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడన్న విషయంపై ముంబై కోచ్ మహేళ జయవర్ధనే స్పందించాడు. 'పవర్‌ప్లేలో బౌలర్లు ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు బుమ్రాపై రిస్క్ తీసుకోవడం లేదు. అందువల్ల అతనికి వికెట్లు దక్కడం లేదు. టీ20 ప్రపంచకప్ తర్వాత బుమ్రాకు స్వల్ప గాయం కావడంతో ప్రారంభంలో అతన్ని జాగ్రత్తగా వినియోగించాం. ఇప్పుడు అతని వేగం క్రమంగా పెరుగుతోంది. మంచి బంతులు వేసినా అదృష్టం కలిసి రావడం లేదు. ఒకసారి వికెట్లు పడడం మొదలైతే అతన్ని ఆపడం కష్టం' అని జయవర్ధనే చెప్పాడు.
టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 16 బంతుల్లో 34 పరుగులు చేసి బెంగళూరుకు భారీ స్కోర్ అందించాడు. ఆర్సీబీ 240/6 భారీ స్కోర్ చేయగా.. ముంబై ఇండియన్స్ 222/5కే పరిమితమైంది. దాంతో వరుసగా నాలుగో మ్యాచులో ఓడిపోయింది. ముంబై ఆరంభ మ్యాచులో గెలిచిన విషయం తెలిసిందే. బుమ్రా ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన ఉన్నప్పటికీ.. అతను త్వరలోనే మళ్లీ తన పాత ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకం టీమ్ మేనేజ్‌మెంట్ వ్యక్తం చేస్తోంది.




