T20 World Cup 2026: స్వర్ణయుగంలో మహిళల క్రికెట్.. ఐసీసీ ఛైర్మన్ జైషా ఆసక్తికర వ్యాఖ్యలు!
ICC Chairman Jay Shah praised women's cricket. మహిళల క్రికెట్ ప్రస్తుతం స్వర్ణయుగంలో ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ జై షా పేర్కొన్నారు.
T20 World Cup 2026: స్వర్ణయుగంలో మహిళల క్రికెట్.. ఐసీసీ ఛైర్మన్ జైషా ఆసక్తికర వ్యాఖ్యలు!
T20 World Cup 2026 Women's: మహిళల క్రికెట్ ప్రస్తుతం స్వర్ణయుగంలో ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ జై షా పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌లో పోరాటం, గెలవాలనే తపనను మనం తప్పక వీక్షించాల్సిందే అన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన అనంతరం జై షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టోర్నమెంట్ ఆరంభం నుంచి ముగింపు వరకు అత్యున్నత స్థాయి ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లను ఆయన ప్రశంసించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టు పెట్టారు.
లార్డ్స్ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను 150 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా ఏడోసారి మహిళల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. లక్ష్య ఛేదనలో స్టార్ బ్యాటర్ బెత్ మూనీ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది. మ్యాచ్ అనంతరం ఐసీసీ ఛైర్మన్ జై షా విజేత జట్టు కెప్టెన్ సోఫీ మోలినెక్స్‌కు ప్రపంచకప్ ట్రోఫీని అందజేశారు.
ప్రపంచకప్ ట్రోఫీని అందించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జై షా.. 'ఏడోసారి మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు హృదయపూర్వక అభినందనలు. మరోసారి అద్భుతమైన ఆటను కొనసాగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఫైనల్ వరకు అద్భుతంగా పోరాడిన ఇంగ్లండ్ జట్టుకూ ప్రత్యేక అభినందనలు. ట్రోఫీ గెలవకపోయినా వారు నిజమైన ఛాంపియన్లే. మహిళా క్రికెట్‌ను మనం తప్పకుండా ఎందుకు చూడాల్సిందో ఈ టోర్నీ చెబుతుంది. నారీమణుల పోరాటం, గెలవాలనే తపనను వీక్షించాల్సిందే. కొందరిలో అద్భుతమైన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రపంచ కప్‌ను ఆకర్షణీయంగా మార్చిన ప్రతి జట్టుకూ, ప్రతి మహిళా క్రికెటర్‌కు ధన్యవాదాలు. మహిళా క్రికెట్‌కు ఇప్పుడు స్వర్ణయుగం' అని పేర్కొన్నారు.
మహిళల క్రికెట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న తరుణంలో ఐసీసీ ఛైర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని అందించేలా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేక్షకాదరణ, పోటీ స్థాయి, వాణిజ్య విలువ పరంగా మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతుండగా.. తాజా ప్రపంచకప్ ఆ విజయయాత్రకు మరో నిదర్శనంగా నిలిచింది. 'మరో ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియాకు కంగ్రాట్స్. అజేయంగా టైటిల్‌ను అందుకొన్న ఆసీస్ ఆట తీరు అద్భుతం. విభిన్న పిచ్‌లపై పరిస్థితులను త్వరగా అలవాటుపడి విజయాలు సాధించడం సాధారణ విషయం కాదు. నిలకడైన ఆట తీరుతోనే ట్రోఫీలు వస్తాయి' అని సచిన్ పేర్కొన్నారు.




