Jos Buttler: వైభవ్ సూర్యవంశీ ఏమైనా ఏఐనా?.. ఎలాన్ మస్క్ దగ్గరుండి మరీ తయారుచేయించారా?
Jos Buttler: వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలపై ఇప్పటికే నెట్టింట ఎన్నో చర్చలు జరుగుతుండగా.. తాజాగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి.
Jos Buttler: వైభవ్ సూర్యవంశీ ఏమైనా ఏఐనా?.. ఎలాన్ మస్క్ దగ్గరుండి మరీ తయారుచేయించారా?
Jos Buttler: ఐపీఎల్ 2026 సీజన్‌లో పెను సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బుడ్డోడి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలపై ఇప్పటికే నెట్టింట ఎన్నో చర్చలు జరుగుతుండగా.. తాజాగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. సూర్యవంశీ ఇన్నింగ్స్‌లను చూసి ఆశ్చర్యపోయిన బట్లర్.. అతను నిజంగానే మనిషేనా లేక ఎలాన్ మస్క్ సృష్టించిన ఏఐనా అని సహచర ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌కు సరదాగా మెసేజ్ చేసినట్లు వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.
వైభవ్ సూర్యవంశీ దూకుడు బ్యాటింగ్‌పై జోస్ బట్లర్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. 'నేను తాజాగా జోఫ్రా ఆర్చర్‌కు సరదాగా ఓ మెసేజ్ చేశా. వైభవ్ సూర్యవంశీ ఏమైనా ఏఐనా?. ఎలాన్ మస్క్ దగ్గరుండి మరీ తయారుచేయించారా?. బ్యాట్‌తో అద్భుతాలు చేయడానికే అతడు వచ్చాడా? అని అడిగా. అందుకు జోఫ్రా నవ్వుతున్న ఓ ఎమోజీ పెట్టి నాకు రిప్లై ఇచ్చాడు. వైభవ్ నిజంగానే మనిషి. అతడు చాలా బ్రిలియంట్. ప్రతి ఒక్క బౌలర్ సీరియస్‌గా దృష్టిపెట్టాల్సిన ప్లేయర్. తప్పకుండా వైభవ్‌ను త్వరలో ఇంగ్లాండ్‌లో చూస్తాను అని చెప్పాడు' అని బట్లర్ తెలిపాడు.
జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న మొదటి మూడు బంతుల్లోనే సిక్సులు కొట్టడం అసాధారణమని జోస్ బట్లర్ చెప్పాడు. 'ఐపీఎల్ 2026లో మ్యాచ్ లేనప్పుడు గదిలో ఫోన్ చూస్తూ ఉన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రెజెంటేషన్ వీడియో కనిపించింది. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడిన పాట్ కమిన్స్‌ను జేమ్స్ ఫ్రాంక్లిన్ ఇంటర్వ్యూ చేశాడు. నువ్వు ఇవాళ జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ క్లబ్‌లో జాయిన్ అయ్యావు అని ఫ్రాంక్లిన్ అన్నాడు. ఏంటా క్లబ్? అని నేను అనుకున్నా. వైభవ్‌కు నువ్వు వేసిన తొలి బంతి సిక్స్‌గా వెళ్లిందని జేమ్స్ చెప్పడంతో అసలు విషయం తెలిసింది. నిజంగానే ఈ టాప్ బౌలర్లను వైభవ్ సిక్స్‌తో ఆహ్వానించాడు. అతడు సూపర్ అనే చెప్పాలి. ఒక కోచ్ 15 ఏళ్ల ఆటగాడికి మొదట బంతిని గమనించమని చెబుతాడు. కానీ అతను మొదటి బంతినే సిక్సర్ కొట్టడం అద్భుతం, ఇంత చిన్న వయసులో అంత ధైర్యం అరుదు' ని బట్లర్ అభిప్రాయపడ్డాడు.
వైభవ్ సూర్యవంశీ హైప్ కేవలం మాటల్లోనే కాదు.. గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 167 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఆ రికార్డు అందరి రస్సెల్ (188 బంతులు, 2019) పేరిట ఉండేది. 9 మ్యాచ్‌ల్లోనే 400 పరుగులు చేసి.. 230కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. 37 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ.. ఈ సీజన్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలుస్తున్నాడు. వైభవ్ దూకుడు, ధైర్యం, రికార్డులు చూస్తుంటే భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని ఏలే స్టార్‌గా ఎదగడం ఖాయమనే భావన కలుగుతోంది.




