Justin Greaves: 5 ఓవర్లు, 0 రన్స్, 5 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారి.. వీడియో వైరల్!

West Indies pacer Justin Greaves Crates Test history. వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత అందుకున్నాడు.

Rishvik
Published on: 28 July 2026 6:36 PM IST
Justin Greaves
X

Justin Greaves: 5 ఓవర్లు, 0 రన్స్, 5 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో మొదటిసారి.. వీడియో వైరల్!

Justin Greaves: వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత అందుకున్నాడు. వరుసగా ఐదు వికెట్ మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ట్రినిడాడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పేసర్ గ్రీవ్స్ ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 5 ఓవర్లు, 0 రన్స్, 5 వికెట్లు.. ఈ గణాంకాలు నమోదవడం 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే మొదటిసారి. ఈ అరుదైన ప్రదర్శనతో గ్రీవ్స్ తన కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ఘనతను కూడా అందుకున్నాడు. ప్రస్తుతం అతడి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

మూడో రోజు ఆటలో లంచ్‌కు ముందు, తర్వాత సాగిన తన స్పెల్‌లో జస్టిన్ గ్రీవ్స్ వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లు నమోదు చేశాడు. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి స్పెల్‌లో గ్రీవ్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఐదు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే సెకండ్ స్పెల్‌లో మాత్రం ఈ ఆల్‌రౌండర్ ఒక్క రన్ ఇవ్వకుండా.. వరసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉండేది. 2016లో దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ టెస్టులో బ్రాడ్ వరుసగా నాలుగు వికెట్ మెయిడెన్ ఓవర్లు వేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు గ్రీవ్స్ ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

32 ఏళ్ల జస్టిన్ గ్రీవ్స్ 11 ఓవర్లు బౌలింగ్ చేసి ఆరు మెయిడెన్లతో కేవలం 27 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. షాన్ మసూద్, మహ్మద్ రిజ్వాన్, ఆమిర్ జమాల్, అలీ ఉస్మాన్, మహ్మద్ అబ్బాస్‌లను ఔట్ చేసి పాకిస్థాన్‌ను 282 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక దశలో 244/3తో భారీ ఆధిక్యం దిశగా సాగుతున్న పాకిస్థాన్‌ను గ్రీవ్స్ ఒక్కసారిగా కుదేలు చేశాడు. షాన్ మసూద్ సెంచరీ అనంతరం అతడిని ఔట్ చేయడంతో పాకిస్థాన్ వరుస వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. తన అద్భుత ప్రదర్శనపై గ్రీవ్స్ సంతోషంగా వ్యక్తం చేశాడు.

'కెప్టెన్ రోస్టన్ చేజ్ ఇచ్చిన సూచనలే నా విజయానికి కారణం. నేను బౌలింగ్‌కు వచ్చినప్పుడు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని కెప్టెన్ సూచించాడు. నేను అదే చేశాను. బంతి స్వింగ్ బాగా స్వింగ్ అవ్వడంతో వికెట్లు దక్కాయి. టెస్టు క్రికెట్‌లో తొలి ఐదు వికెట్లు తీయడం చాలా సంతోషంగా ఉంది. అయితే మ్యాచ్‌లో నా పని ఇంకా మిగిలే ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవాలని చూస్తున్నాం' అని గ్రీవ్స్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ బౌలర్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ను 126/7కు పరిమితం చేసి.. ఆ జట్టు ఆధిక్యాన్ని 155 పరుగులకే కట్టడి చేశారు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story