Kagiso Rabada: 11 ఏళ్లుగా ఇదే చేస్తున్నా.. వైభవ్ డ్యూయల్ సిక్సులపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kagiso Rabada shares his calm reaction. ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి ప్రపంచ క్రికెట్ మొత్తం మాట్లాడుకుంటోంది.

Rishvik
Published on: 10 May 2026 6:35 PM IST
Kagiso Rabada
X

Kagiso Rabada: 11 ఏళ్లుగా ఇదే చేస్తున్నా.. వైభవ్ డ్యూయల్ సిక్సులపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kagiso Rabada: ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి ప్రపంచ క్రికెట్ మొత్తం మాట్లాడుకుంటోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే బౌలర్లపై విరుచుకుపడుతూ.. రికార్డులు బద్దలు కొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌ వైభవ్‌కు బౌలింగ్ చేయడం సీనియర్ బౌలర్లకూ పెను సవాలుగా మారింది. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా, ఫ్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడిని పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కాగిసో రబాడ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నాడు. వైభవ్ తన బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదినప్పటికీ.. 11 ఏళ్లుగా నాకు తెలిసిన విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లో శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ ఆరంభంలో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కాగిసో రబాడ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఒకటి ఫైన్ లెగ్ మీదుగా, మరొకటి మిడ్‌వికెట్ వైపు స్టాండ్స్‌లోకి వెళ్లాయి. మ్యాచ్ అనంతరం ఈ డ్యూయల్ సిక్సుల గురించి అడిగితే.. రబాడ నవ్వుతూ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్‌ను కొనసాగించాలి’ అని చెప్పాడు. రబాడ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి రబాడ మాట్లాడుతూ.. ‘శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్‌గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుభ్‌మన్ గిల్ (84) చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 229/4 భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. జేసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు. రబడా రెండు వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో గుజరాత్ వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story