Vaibhav Sooryavanshi: పనులన్నీ పక్కనపెట్టి.. వైభవ్ బ్యాటింగ్ కోసం టీవీ ముందు కూర్చున్నా: భారత లెజెండరీ కెప్టెన్
Kapil Dev Hails Vaibhav Sooryavanshi Batting: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు.
Vaibhav Sooryavanshi: పనులన్నీ పక్కనపెట్టి.. వైభవ్ బ్యాటింగ్ కోసం టీవీ ముందు కూర్చున్నా: భారత లెజెండరీ కెప్టెన్
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన అసాధారణ ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీ20 క్రికెట్‌లో అసాధారణ స్థాయిలో రాణించిన వైభవ్ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా ఎదుగుతాడని కపిల్ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశాడు. గత ఏడాది వైభవ్ ఆటను మొదటిసారి చూసినప్పుడే అతడు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి క్రికెటర్ అవుతాడని తాను చెప్పానని గుర్తు చేశాడు. ఇప్పుడు మాత్రం ఎలాంటి సందేహం లేదని, 15 ఏళ్ల వయసులోనే బుడ్డోడు ప్రపంచంలోనే అత్యంత అసాధారణ టీ20 బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడని భారత లెజెండరీ కెప్టెన్ కొనియాడాడు.
'వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా అద్భుతం. అతడి మ్యాచ్ ఉన్నప్పుడల్లా పనులన్నీ పక్కన పెట్టాను. టీవీ ముందు కూర్చొని అతడి ఆటను చూడటానికి నేను ప్రత్యేకంగా సమయం కేటాయించేవాడిని. అంతటి ప్రభావాన్ని వైభవ్ తన ఆటతో చూపించాడు" అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ చరిత్రాత్మక ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి.. టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 242కు పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగుల వరద పారించిన ఈ యువ బ్యాటర్.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
అంతేకాకుండా టీ20 దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టడం విశేషం. ఈ ఘనతను కేవలం 15 ఏళ్ల వయసులో సాధించడం అసాధారణమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. '776 పరుగులు, 242కు పైగా స్ట్రైక్‌రేట్.. ఇలాంటి గణాంకాలను ప్రపంచంలో ఎవరూ ఊహించి ఉండరు. కానీ వైభవ్ వాటిని నిజం చేశాడు. అతడు నిజంగా ప్రత్యేకమైన ఆటగాడు. భారత క్రికెట్‌కు అమూల్యమైన ఆస్తి. అతడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాలి' అని బీసీసీఐకి కపిల్ దేవ్ సూచించాడు.
భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీకి అన్ని ఫార్మాట్లలోనూ అవకాశాలు రావాలని కోరుకున్న కపిల్ దేవ్.. అతడు భారత క్రికెట్‌లో మరో పెద్ద స్టార్‌గా ఎదిగే సామర్థ్యం కలిగి ఉన్నాడని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026లో బ్యాట్‌తో సంచలనాలు సృష్టించిన వైభవ్ ఇప్పటికే అభిమానుల హృదయాలను గెలుచుకోగా.. ఇప్పుడు కపిల్ దేవ్ వంటి దిగ్గజాల ప్రశంసలు అందుకోవడం అతని కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా నిలిచింది. వైభవ్ దూకుడు ఆటతో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాలు అందుకుంది. క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.




