Virat Kohli: 'కోహ్లీ చేసిన పెద్ద తప్పు అదే.. 10 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపపడతాడు.!'
Virat Kohli: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశారని, తన నిర్ణయానికి 10 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపపడతారని, కోపంతో రిటైర్ కావడం సరికాదని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
Virat Kohli: 'కోహ్లీ చేసిన పెద్ద తప్పు అదే.. 10 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపపడతాడు.!'
Virat Kohli: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశారని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. తన నిర్ణయానికి 10 ఏళ్ల తర్వాత పశ్చాత్తాపపడతారని వ్యాఖ్యానించారు. 'కోహ్లీ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. ఈ విషయంలో ఆయన మిగతా ప్లేయర్ల కంటే మెరుగ్గా ఉన్నారు. 25 ఏళ్ల ఆటగాడితోనూ పోటీ పడగలరు. కోపంతో రిటైర్ కావడం సరికాదు' అని చెప్పారు. 2025 మే నెలలో టెస్టులకు కోహ్లీ వీడ్కోలు పలికారు.
సండే మిడ్-డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మొదట మహ్మద్ షమీ టెస్టు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉదాహరణగా కోహ్లీ ప్రస్తావన తెచ్చారు. షమీ నవంబర్ 6న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. 13 ఏళ్ల కెరీర్‌లో 64 టెస్టుల్లో 229 వికెట్లు తీశారు. 'ఆయన టెస్టులకు రిటైర్ కావాల్సింది కాదు. మరో రెండేళ్లు ఆడే అవకాశం ఉంటే ఎందుకు వదులుకోవాలి? ఈ అవకాశం మళ్లీ రాదు' అని కపిల్ అన్నారు.
కోహ్లీ 2025 మే 12న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ సమయంలో ఆయన వయసు 36 ఏళ్లు. భారత్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడడానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచుల్లో 9,230 పరుగులు, 30 సెంచరీలు చేశారు. ఆయన చివరి టెస్ట్ 2025 జనవరిలో ఆస్ట్రేలియాపై సిడ్నీలో జరిగింది. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయికి 770 పరుగుల దూరంలో ఆగిపోయారు.
రిటైర్మెంట్ నిర్ణయాలపై కపిల్ మరో ఉదాహరణ కూడా చెప్పారు. 'కోపంతో రిటైర్ కావడం సరికాదు. వాళ్లు మొహిందర్ అమర్‌నాథ్‌లా ఉండాలి. ఆయనను చాలాసార్లు జట్టు నుంచి తొలగించారు, కానీ తిరిగొచ్చి అందరినీ తప్పని నిరూపించారు' అన్నారు. కష్టకాలంలో ఆటను వదిలేయడం కంటే తిరిగి జట్టులోకి రావడానికి పోరాడాలన్నది ఆయన సూచన.
ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్ తరఫున ఆడుతున్నారు. అంతకుముందే టీ20 అంతర్జాతీయాలకు వీడ్కోలు పలికారు. 2027 వన్డే వరల్డ్ కప్ తనకు చివరి వరల్డ్ కప్ అవుతుందని ఆయన చెప్పారు. టెస్టులకు మళ్లీ తిరిగి రావడం గురించి కోహ్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.




