Devdutt Padikkal Journey: కేరళ టు తెలంగాణ టు కర్ణాటక.. ఇండిపెండెన్స్ హీరో 'దేవదత్ పడిక్కల్' స్టోరీ ఇదే!
Devdutt Padikkal Journey. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక.. ఇండిపెండెన్స్ హీరో 'దేవదత్ పడిక్కల్' క్రికెట్ జర్నీ గురించి తెలుసా?
Devdutt Padikkal Journey: కేరళ టు తెలంగాణ టు కర్ణాటక.. ఇండిపెండెన్స్ హీరో 'దేవదత్ పడిక్కల్' స్టోరీ ఇదే!
Devdutt Padikkal Journey: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరిశాడు. రెండేళ్ల క్రితం టెస్టు జట్టులోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ యువ బ్యాటర్.. మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. సాయి సుదర్శన్ గాయంతో దూరం కావడంతో జట్టులో చోటు దక్కించుకున్న పడిక్కల్.. శ్రీలంక బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. 134 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న అతడు.. 178 బంతుల్లో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఫస్ట్ డౌన్లో తొలి సెంచరీ:
భారత్ తరఫున ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేస్తూ టెస్టు సెంచరీ సాధించిన ఎడమచేతి వాటం బ్యాటర్ల జాబితాలో దేవదత్ పడిక్కల్ చేరాడు. ఈ స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా వినోద్ కాంబ్లీ నాలుగు శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. సౌరవ్ గంగూలీ మూడు సెంచరీలు సాధించాడు. సలీం దురానీ, బాపు నాద్కర్ణి, అజిత్ వాడేకర్, ఏకనాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్ తర్వాత.. ఇప్పుడు పడిక్కల్ కూడా ఈ ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. భారత్ తరఫున ఫస్ట్ డౌన్లో పడిక్కల్‌కు ముందు శుభ్‌మన్ గిల్ 2024 మార్చిలో సెంచరీ (110) చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ల భారత బ్యాటర్ నుంచి టెస్టు శతకం రావడానికి 19 మ్యాచ్‌లు పట్టింది. ఇప్పుడు పడిక్కల్ సెంచరీతో ఫస్ట్ డౌన్ స్థానంలో భారత్‌కు ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లే.
గతంలో నిరాశపరిచిన పడిక్కల్:
సుమారు రెండేళ్ల క్రితం భారత టెస్టు జట్టులోకి వచ్చిన పడిక్కల్.. ఫస్ట్ డౌన్లో ఆడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వరుసగా 65, 0, 25 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. అయితే ఈసారి అంతకుమించి అన్నట్లు ఆడాడు. శ్రీలంక-ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే పడిక్కల్ తన బ్యాటింగ్ సత్తాను చాటాడు. గాలెలో 94 పరుగులు చేసిన తర్వాత మరో మ్యాచ్‌లో 101 నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు కొలంబోలో ఎస్ఎల్సీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ గేమ్‌లో 164 బంతుల్లో 142 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో శ్రీలంక బౌలర్లకు టెస్టు మ్యాచ్‌కు ముందే పడిక్కల్ బ్యాటింగ్ సామర్థ్యం అర్థమైంది.
వరుసగా భారీ స్కోర్లు:
ఇటీవలి ఫస్ట్ క్లాస్ ప్రదర్శనలు పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పంజాబ్‌పై 9, 120 నాటౌట్.. ముంబైపై 17, 39.. ఉత్తరాఖండ్‌పై 232.. అనంతరం శ్రీలంక-ఏపై 12, 67, 94.. ఆ తర్వాత 101 నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌పై రంజీ సెమీ ఫైనల్లో 232 పరుగులు చేయడం అతడి బ్యాటింగ్ స్థాయిని చూపించింది. ఈ వరుస ప్రదర్శనలే అతడికి మరోసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కేలా చేశాయి. జాతీయ జట్టులోకి వచ్చిన వెంటనే సెంచరీ చేయడంతో పడిక్కల్ బీసీసీఐ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
స్కూల్ క్రికెట్లోనే సత్తా:
పడిక్కల్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి ఉండేది. కేరళలోని మలప్పురం జిల్లా ఎడప్పాల్‌లో 2000 జూలై 7న జన్మించిన దేవదత్.. తల్లిదండ్రులు బాబును కున్నత్, అంబిలి పడిక్కల్‌తో కలిసి చిన్నతనంలో హైదరాబాద్‌కు వచ్చాడు. కొడుకులోని క్రికెట్ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు అతడికి మెరుగైన శిక్షణ అందించేందుకు కర్ణాటకకు మారారు. అక్కడే పడిక్కల్ క్రికెట్లో ఎదిగాడు. స్కూల్ స్థాయిలోనే అతడి ప్రతిభ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ తరఫున ఆడుతూ.. కర్ణాటక స్కూల్ క్రికెట్లో బలమైన జట్టుగా పేరున్న సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ హైస్కూల్‌పై అద్భుత ప్రదర్శన చేయడంతో కన్నడనాట అతడి పేరు మారుమోగింది.
దేశవాళీ, ఐపీఎల్లో అదరగొట్టి:
పడిక్కల్ 2018లో దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2019-20 సీజన్ అతడి కెరీర్లో కీలక మలుపుగా మారింది. విజయ్ హజారే ట్రోఫీలో 609 పరుగులు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 580 పరుగులు చేసి కర్ణాటక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనతో ఐపీఎల్‌లోనూ అవకాశం దక్కింది. 2020 సీజన్లో 473 పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. దేశవాళీ, ఐపీఎల్లో వరుసగా మెరుగైన ప్రదర్శనలు చేయడంతో భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. 2021లో శ్రీలంకపై టీ20 అరంగేట్రం చేసిన పడిక్కల్.. 2024లో ఇంగ్లండ్‌పై తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు.
పడిక్కల్ నుంచి మరిన్ని అద్భుతాలు?:
ప్రస్తుతం పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో భారీ స్కోర్లు, శ్రీలంక-ఏపై వరుసగా మంచి ఇన్నింగ్స్‌లు, ఇప్పుడు టెస్టులో సెంచరీ.. ఇలా అతడి బ్యాట్ నుంచి వరుసగా భారీగా రన్స్ వస్తున్నాయి. ఈ ఫామ్‌ను కొనసాగిస్తే భారత టెస్టు జట్టులో ఫస్ట్ డౌన్ స్థానానికి పడిక్కల్ బలమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయిన పడిక్కల్.. ఇప్పుడు రెండున్నరేళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చి సెంచరీతో సమాధానం చెప్పాడు. తొలి టెస్టు సెంచరీతోనే తన రాకను ఘనంగా చాటిన పడిక్కల్.. భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని శాశ్వతం చేసుకుంటాడా? అనేది చూడాలి.




