KKR vs DC : కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, కుల్దీప్ యాదవ్ మ్యాజిక్.. కోల్‌కతాపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం

KKR vs DC : ఐపీఎల్ 2026 చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పెల్‌తో కేకేఆర్ కుప్పకూలింది.

CR Reddy
Published on: 25 May 2026 6:28 AM IST
KKR vs DC
X

KKR vs DC 

KKR vs DC : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపు మ్యాచ్‌ల్లో భాగంగా కోల్‌కతాలోని ప్రసిద్ధ ఈడన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 70వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును ఢిల్లీ చిత్తు చేసింది. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. విశేషం ఏంటంటే, ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ విజయం సాధించగా, కేకేఆర్ ఓటమితో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. అంటే ఇరు జట్ల సీజన్ ఎలా మొదలైందో.. సరిగ్గా అలాగే ముగిసింది. ఈ ఓటమితో కేకేఆర్ ఈ సీజన్‌లో తన 7వ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 30 బంతుల్లోనే 60 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే పునాది వేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ అక్షర్ పటేల్ బాధ్యతాయుతంగా ఆడి 39 రన్స్ చేశాడు. ఆఖరి ఓవర్లలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ డేవిడ్ మిల్లర్ (28 రన్స్), యువ సంచలనం ఆశుతోష్ శర్మ (నాట్ అవుట్ 18 రన్స్) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ స్కోరు 200 దాటింది. కేకేఆర్ బౌలర్లలో సౌరభ్ దూబే 2 వికెట్లతో రాణించగా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తక్కువ పరుగులిచ్చి తలో వికెట్ పడగొట్టారు.

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. అజింక్యా రహానే, ఫిన్ అలెన్ కలిసి మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 43 రన్స్ జోడించారు. ఫిన్ అలెన్ 20 రన్స్ చేయగా, వన్ డౌన్ లో వచ్చిన మనీష్ పాండే 25 రన్స్ చేసి అవుట్ అయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి కేకేఆర్‌ను రేసులో ఉంచాడు. కానీ రహానే అవుట్ కావడమే ఆలస్యం.. కేకేఆర్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. కామెరాన్ గ్రీన్ (2), రింకూ సింగ్ (0), అనుకుల్ రాయ్ (9) ఘోరంగా విఫలం కావడంతో కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆల్‌అవుట్ అయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 29 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే రహానే, రింకూ సింగ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ ఛాన్స్ అందుకున్నాడు. కానీ మూడో బంతికి ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో ఐపీఎల్ 2026 మొదటి హ్యాట్రిక్ రికార్డు తృటిలో మిస్ అయింది. కుల్దీప్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్గిడి కూడా 3 వికెట్లతో చెలరేగగా, భారీ ధర పలికిన మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాసించారు. దాంతో ఢిల్లీ తన ఆఖరి మ్యాచ్‌ను ఘనమైన విజయంతో ముగించి అభిమానులకు ఆనందాన్ని మిగిల్చింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story