KKR vs GT: మాకు మూడు ఫైనల్ మ్యాచ్‌లు.. కేకేఆర్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

KKR vs GT: ఇకపై కేకేఆర్ ఆడే ప్రతి మ్యాచ్ ఫైనల్ లాంటిదే అని రహానే అభిప్రాయపడ్డాడు.

Rishvik
Published on: 16 May 2026 7:59 PM IST
KKR vs GT
X

KKR vs GT: మాకు మూడు ఫైనల్ మ్యాచ్‌లు.. కేకేఆర్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

KKR vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. టాప్-4 బెర్త్ కోసం టీమ్స్ కొన్ని టీమ్స్ పోరాడుతున్నాయి. అందులో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కూడా ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 9 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉన్నా.. ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. కేకేఆర్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే 15 పాయింట్లకు చేరుతుంది. భారీ నెట్ రన్‌రేట్ మెరుగుదలతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలిస్తేనే కోల్‌కతాకు ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇకపై కేకేఆర్ ఆడే ప్రతి మ్యాచ్ ఫైనల్ లాంటిదే. ఇదే విషయాన్ని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో కేకేఆర్ తలపడుతుంది. ఈ కీలక మ్యాచ్‌లో జీటీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్‌ను చాలా కీలకంగా భావిస్తోంది. టాస్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. జట్టు ప్రస్తుతం మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపాడు. ‘మేము ఒక్కో మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. మూడింటినీ గెలిస్తేనే తర్వాతి అవకాశాల గురించి ఆలోచించగలం. మాకు మూడు ఫైనల్ మ్యాచ్‌లు అనే చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించాం. జట్టులోని ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అందరూ కలిసి జట్టుగా బాగా ఆడుతున్నారు’ అని చెప్పాడు.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ పరిస్థితుల గురించి కూడా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. నిన్న భారీ వర్షం పడింది. పిచ్‌పై కొద్దిగా తేమ ఉంది. అయితే గాలి ఎక్కువగా ఉండటంతో డ్యూ ఎంత ప్రభావం చూపుతుందో చెప్పలేం. ఏ పరిస్థితి వచ్చినా మేము మా బెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నాడు. జట్టు కాంబినేషన్‌పై మాట్లాడుతూ.. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పూర్తిగా ఫిట్ అయ్యాడని రహానే వెల్లడించాడు. వరుణ్ తిరిగి జట్టులోకి రావడం కేకేఆర్‌కు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరువలో ఉంది. టాప్-2 స్థానం ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు చాలా కీలకం. దీంతో ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలోని చివరి స్థానాల్లో నిలిచిన జట్లు ఇప్పుడు చెలరేగుతున్నాయి. ఇతర టీమ్‌ల ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బకొడుతూ.. సంచలన విజయం సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్‌ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story