KL Rahul: నన్నెప్పుడూ టీ20 ప్లేయర్‌గా భావించలేదు, ఇంకేం చేయాలి.. రాహుల్ ఆవేదన!

KL Rahul: భారత జట్టు స్టార్ బ్యాటర్ లోకేష్ రాహుల్ తన టీ20 కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 5 May 2026 8:25 PM IST
KL Rahul
X

KL Rahul: నన్నెప్పుడూ టీ20 ప్లేయర్‌గా భావించలేదు, ఇంకేం చేయాలి.. రాహుల్ ఆవేదన!

KL Rahul: భారత జట్టు స్టార్ బ్యాటర్ లోకేష్ రాహుల్ తన టీ20 కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ ప్రారంభ దశలో తాను టీ20 ఫార్మాట్‌కు సరిపోడని చాలా మంది భావించారని, టెస్ట్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్‌తోనే గుర్తింపు పొందానని వెల్లడించాడు. అయితే కాలక్రమేణా తన ఆటలో మార్పులు చేసుకుంటూ వైట్ బాల్ క్రికెట్‌లో కూడా రాణించడం గర్వంగా ఉందని చెప్పాడు. పదేళ్ల క్రితం భారత టీ20 జట్టులో భాగం కావడానికి అన్ని విధాలుగా కష్టపడ్డా అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 185.84 స్ట్రైక్‌రేట్‌తో 433 రన్స్ చేశాడు. హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (440) తర్వాత టోర్నీలో సెకండ్‌ లీడింగ్‌ స్కోరర్‌గా రాహుల్ కొనసాగుతున్నాడు. గత నెలలో ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 64 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతడి టీ20 సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. మ్యాచ్ ఓడిపోయినా.. రాహుల్ ఇన్నింగ్స్ మాత్రం అందరి ప్రశంసలు అందుకుంది. 2022 తర్వాత టీమిండియా తరఫున టీ0 మ్యాచ్ ఆడకపోయినా.. టెస్టులు, వన్డేల్లో మాత్రం రాహుల్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సందర్భంగా మాట్లాడుతూ.. టెస్ట్ ముద్రను చెరిపి వేసుకుని ఆల్‌-ఫార్మాట్‌ క్రికెటర్‌గా ఎలా ఎదిగాననే విషయాన్ని వెల్లడించాడు.

‘జియోస్టార్ సూపర్‌స్టార్స్’ కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్ రాహుల్... 'పది సంవత్సరాల క్రితం టీ20 జట్టులో చోటు కోసం చాలా కష్టపడ్డా. కానీ అప్పట్లో నన్నెవరూ టీ20 ప్లేయర్‌గా చూడలేదు. నాకు టెస్ట్ ప్లేయర్ అనే ట్యాగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను పూర్తిగా దూరం చేసుకున్నాను. ఆటలో ఇప్పుడు ఇంత దూరం రావడం చాలా ఆనందంగా ఉంది' అని పేర్కొన్నాడు. 'నా ప్రయాణంలో తప్పులు కూడా జరిగాయి. కొన్ని విషయాలు ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉంది. అయినప్పటికీ ప్రతి మ్యాచ్‌లో నా 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నింస్తా. క్రీడల్లో విజయాలు, అపజయాలు సహజం. వాటిని సమానంగా స్వీకరించడం నేర్చుకున్నా' అని రాహుల్ తెలిపాడు.

ఇక వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద మార్పు వచ్చిందని లోకేష్ రాహుల్ చెప్పాడు. భార్య అతియా శెట్టి తనకు చాలా మద్దతుగా ఉంటుందని తెలిపాడు. గత ఏడాది తండ్రిగా మారిన అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని వెల్లడించాడు. 'నా బిడ్డ నవ్వు చూసినప్పుడు అన్ని బాధలు మరిచిపోతాను. అది నాకు మరింత ప్రశాంతత ఇచ్చింది. ఇప్పుడు ఆట గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. మైదానంలో ఉన్నప్పుడు కేవలం ఆటను ఆస్వాదిస్తున్నాను' అని చెప్పాడు. ఇంకా తన కెరీర్‌లో కొన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయని, మరిన్ని ట్రోఫీలు గెలవాలనే లక్ష్యంతో కృషి కొనసాగిస్తానని రాహుల్ స్పష్టం చేశాడు. విమర్శలు, నిరాకరణల మధ్య తనను తాను నిరూపించుకున్న రాహుల్.. ఇప్పుడు మరింత స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story