IPL 2027: షేర్ ఆయేగా.. ఇక కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడం బెటర్!
IPL 2027: KL Rahul vs Rishabh Pant. ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
IPL 2027: షేర్ ఆయేగా.. ఇక కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడం బెటర్!
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి (ట్రేడ్) వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) జట్ల మధ్య ఓ ట్రేడ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ట్రేడ్ డీల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరుతున్నాడు.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్‌తో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ ట్రేడ్‌లో భాగంగా రిషభ్ పంత్ డీసీకి తిరిగి వెళుతుండగా, భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. పంత్ గతంలో తొమ్మిది సీజన్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి జట్టుకు నాయకత్వం కూడా వహించాడు.
అయితే 2025 మెగా వేలానికి ముందు డీసీ అతడిని విడుదల చేయగా.. లక్నో రూ.27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇప్పుడు పంత్ మళ్లీ ఢిల్లీకి వస్తాడనే వార్తల నేపథ్యంలో భారత మాజీ పేసర్ దొడ్డ గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.దొడ్డ గణేశ్ సోషల్ మీడియా స్పందించారు. 'రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వస్తే కేఎల్ రాహుల్ జట్టును వీడి వేలంలోకి వెళ్లడం బెటర్. ఐపీఎల్ 2026లో రాహుల్ మంచి ప్రదర్శన చేశాడు.
వేలంలో అతడికి భారీ డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి' అని దొడ్డ గణేశ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఐపీఎల్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారి తీశాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో జట్టులో చేరిన అతడు 14 మ్యాచ్‌ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అతని నాయకత్వం కూడా గొప్పగా ఏమీ లేదు. ఎల్‌ఎస్‌జీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. జట్టు పరాజయాలకు బాధ్యతగా సీజన్ అనంతరం పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు.
మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం అద్భుత ఫామ్ కనబరిచాడు. 14 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేసిన అతడు జట్టుకు ప్రధాన బ్యాటర్‌గా నిలిచాడు. 174.41 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్న రాహుల్.. పంజాబ్ కింగ్స్‌పై అజేయంగా 152 పరుగులు చేసి తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు.
ఈ ట్రేడ్‌లో మరో ఆసక్తికర అంశం పంత్ వేతనం. ప్రస్తుతం లక్నోలో రూ.27 కోట్లు అందుకుంటున్న పంత్.. ఢిల్లీకి తిరిగి రావడానికి పారితోషికంలో భారీ కోతకు అంగీకరించినట్లు సమాచారం. నివేదికల ప్రకారం అతడు సుమారు రూ.15 కోట్లకు డీసీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో కుల్దీప్ యాదవ్‌కు ప్రస్తుతం ఉన్న రూ.13.25 కోట్ల వేతనం యథాతథంగా కొనసాగనున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు ఈ ట్రేడ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ లేదా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ రిషభ్ పంత్ రీ-ఎంట్రీ, కేఎల్ రాహుల్ భవిష్యత్తు, కుల్దీప్ యాదవ్ ట్రేడ్ వంటి అంశాలు ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ట్రేడ్ నిజమైతే వచ్చే సీజన్‌లో ఐపీఎల్ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.




