Virat Kohli: కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేస్తే కోట్లు ఇస్తాం.. జర్మన్ ఇన్‌ఫ్లూయెన్సర్ షాకింగ్ కామెంట్స్!

Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Rishvik
Published on: 12 May 2026 7:16 PM IST
Virat Kohli
X

Virat Kohli: కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేస్తే కోట్లు ఇస్తాం.. జర్మన్ ఇన్‌ఫ్లూయెన్సర్ షాకింగ్ కామెంట్స్!

Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జర్మన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, మోడల్‌ లిజ్లాజ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు కారణం. కొద్ది రోజుల క్రితం లిజ్లాజ్‌ పోస్ట్‌కు కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి లైక్ కొట్టగా.. అది కాస్త సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఆ ఒక్క లైక్‌తో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయిన లిజ్లాజ్‌.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశ్చర్యకర విషయాలను బయటపెట్టారు.

విరాట్ కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలని, అతడిని సోషల్ మీడియాలో విమర్శించాలని కొందరు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని లిజ్లాజ్‌ వెల్లడించారు. అయితే అలాంటి ఆఫర్లను తాను సున్నితంగా తిరస్కరించానని స్పష్టం చేశారు. ‘కొంతమంది విలేకరులు విరాట్ కోహ్లీ గురించి చెడు మాట్లాడాలని,

అతడు చేయని పనులు చేశాడని చెప్పాలని కోరారు. అందుకు భారీగా డబ్బు ఇస్తామని కూడా చెప్పారు. నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. కానీ నేను అలా ఎందుకు చేస్తాను?. విరాట్ నా ఫేవరెట్ క్రికెటర్. డబ్బు కోసం అతడిపై తప్పుడు వ్యాఖ్యలు చేయను. కోహ్లీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఆసక్తి, ఉద్దేశం నాకు లేదు’ అని లిజ్లాజ్‌ చెప్పారు.

విరాట్ కోహ్లీ కొట్టిన ఆ ఒక్క ‘లైక్’ తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని లిజ్లాజ్‌ తెలిపారు. ‘మొదట నాకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా చాలా మంది కాల్స్ చేశారు. నా ఫోన్ నోటిఫికేషన్లతో నిండిపోయింది. గూగుల్ ఓపెన్ చేసి చూసే సరికి నా గురించి పేజీల కొద్దీ వార్తలు కనిపించాయి. అది చాలా అవాస్తవంగా అనిపించింది’ అని పేర్కొన్నారు.

భారతదేశంలో చాలా మందికి లిజ్లాజ్‌ గురించి తెలియకపోయినా.. జర్మనీలో మాత్రం చాలా మందికి విరాట్ కోహ్లీ గురించి తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇండియాలో లిజ్లాజ్‌ ఎవరు? అని అడిగారు. కానీ జర్మనీలో విరాట్ కోహ్లీ ఎవరు? అనే హెడ్‌లైన్స్ కనిపించాయి. ఎందుకంటే అక్కడ క్రికెట్ అంతగా పాపులర్ కాదు' అని చెప్పుకొచ్చారు.

ఈ ఘటన తర్వాత తనకు అనేక బ్రాండ్ ప్రమోషన్ అవకాశాలు వచ్చాయని కూడా లిజ్లాజ్‌ వెల్లడించారు. స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో పాల్గొనే అవకాశాలు కూడా దక్కాయని చెప్పింది. ‘పోస్ట్ మ్యాచ్ కార్యక్రమాలు, ప్లేయర్ ఇంటర్వ్యూలు, ట్రోఫీ సెరిమనీల్లో పాల్గొన్నాను. క్రికెట్ వాతావరణంలో భాగమవ్వడం అద్భుతంగా అనిపించింది. నాకు భారీ మొత్తంలో డబ్బుతో కొన్ని ఆఫర్లు వచ్చాయి.

కానీ నా విలువలకు వ్యతిరేకంగా ఉండే పనులు చేయాలనుకోవడం లేదు’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఐపీఎల్ 2026లో ఆడుతున్న కోహ్లీ.. జట్టును ప్లేఆఫ్స్ దిశగా నడిపిస్తున్నాడు. వరుస విజయాలతో ఆర్సీబీ మంచి ఫామ్‌లో ఉండగా.. కోహ్లీ మాత్రం ఇటీవల రెండు వరుస మ్యాచ్‌ల్లో డకౌట్ అవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇక బుధవారం కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఎలా రాణిస్తాడో ఆసక్తిగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story