కోహ్లీ-గంభీర్ మాట్లాడుకోవడం లేదా?.. అసలు నిజం చెప్పేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్!
Kohli-Gambhir: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
కోహ్లీ-గంభీర్ మాట్లాడుకోవడం లేదా?.. అసలు నిజం చెప్పేసిన టీమిండియా బ్యాటింగ్ కోచ్!
Kohli-Gambhir: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరు కలిసి మాట్లాడుకున్న వీడియోస్ కానీ.. ఫొటోస్ కానీ లేకపోవడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ సందర్భంగా నెట్స్‌లో ఇద్దరూ మాట్లాడుకోలేదనే వీడియోలు వైరల్ కావడంతో,
ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కోహ్లీ, గంభీర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు.
బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఈరోజే కనీసం పది సార్లు మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి దూరం లేదు. వారిని కలపడానికి ఎవరి అవసరమూ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలను సందర్భానికి సంబంధం లేకుండా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జట్టులో అంతా బాగానే ఉంది. ప్రతి ఒక్కరు బాగా ఉంటారు. ఎవరి మధ్య విబేధాలు లేవు' అని స్పష్టం చేశాడు.
కోహ్లీతో తన సంభాషణ గురించి కూడా కోటక్ వివరించాడు. 'ఈరోజు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు విరాట్ కొన్ని సాంకేతిక అంశాల గురించి నాతో మాట్లాడాడు. అతడి ఫుట్‌వర్క్ ఎలా ఉందనే విషయంపై చర్చించాం. నిజం చెప్పాలంటే విరాట్ లాంటి బ్యాటర్‌కు అవసరం లేని సలహాలు ఇవ్వాల్సిన పని లేదు.
అతడికి ఏదైనా అనిపించినప్పుడు లేదా ఏదైనా గమనించినప్పుడు మాత్రమే మేము చర్చిస్తాం. నెట్స్ ముగిసిన తర్వాత కూడా మేము బ్యాటింగ్‌కు సంబంధించిన విషయాలపైనే మాట్లాడుకున్నాం. కానీ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు' అని చెప్పాడు.
మొదటి వన్డేలో విఫలమైన విరాట్ కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. 66 బంతుల్లో 65 పరుగులు చేసి తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కింగ్ ఔటయ్యాడు. శ్రేయస్ కూడా 66 పరుగులు చేసినప్పటికీ.. భారత్ 233 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం ఇంగ్లండ్ 234 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేపై అందరి దృష్టి నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు పొట్టి సిరీస్ ఓటమికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలని గిల్ సేన చూస్తోంది.




