Kranti Gaud: అమ్మ నగలు అమ్మింది.. ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు.. క్రాంతి గౌడ్ సక్సెస్ జర్నీ ఇదే!
Kranti Gaud: ఓ చిన్న గ్రామం నుంచి భారత జట్టు వరకు రావడానికి క్రాంతి గౌడ్ ఎంతో కష్టపడింది.
Kranti Gaud: అమ్మ నగలు అమ్మింది.. ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు.. క్రాంతి గౌడ్ సక్సెస్ జర్నీ ఇదే!
Kranti Gaud: క్రాంతి గౌడ్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక పేసర్‌గా ఉంది. ప్రస్తుతం ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆడుతున్న క్రాంతి.. ఓ చిన్న గ్రామం నుంచి భారత జట్టు వరకు రావడానికి ఎంతో కష్టపడింది. క్రాంతితో పాటు ఆమె కుటుంబం కూడా ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు చేసింది.
ఈ నేపథ్యంలోనే తన విజయాల వెనుక ఉన్న కుటుంబ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేనని తాజాగా క్రాంతి భావోద్వేగంగా చెప్పింది. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు చేరుకున్న తన ప్రయాణం ఎన్నో కష్టాలు, త్యాగాలతో నిండిపోయిందని తెలిపింది. ముఖ్యంగా తన క్రికెట్ కలను నిజం చేసేందుకు తల్లి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టింది.
తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న క్రాంతి గౌడ్.. కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన కలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేయలేదని చెప్పింది. 'నాకు సరైన క్రికెట్ కిట్ కొనివ్వడానికి మా అమ్మ తన నగలను అమ్మేసింది. అది మా కుటుంబంలో చాలా పెద్ద త్యాగం. నా కోసం మా అమ్మ, నాన్న చేస్తున్న కష్టాన్ని చూసి నేను మరింత బాధ్యతగా మారాను. వారి త్యాగానికి ప్రతిఫలం ఇవ్వాలని, వారిని గర్వపడేలా చేయాలని ఎప్పుడే నిర్ణయించుకున్నాను' అని క్రాంతి వెల్లడించింది.
అప్పటి పరిస్థితుల్లో చాలా మంది అమ్మాయిలను బయటకు కూడా పంపేవారు కాదని, కానీ తన తల్లిదండ్రులు మాత్రం భిన్నంగా ఆలోచించారని క్రాంతి గౌడ్ తెలిపింది. 'నేను చేస్తున్నది తప్పు అని వారికి ఎప్పుడూ అనిపించలేదు. నా కలను నమ్మారు, నన్ను ప్రోత్సహించారు. కుటుంబం మీకు అండగా ఉంటే బయట ప్రపంచం ఏమనుకుంటుందో పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అదే నాకు ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చింది' అని పేర్కొంది. క్రాంతి భారత జట్టులోకి రావడం ఆమె గ్రామానికి కూడా స్ఫూర్తిగా మారింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆమె ప్రదర్శన తర్వాత స్వగ్రామమైన ఘువారా గ్రామంలో క్రికెట్ అకాడమీ ప్రారంభమైంది.
ఇప్పుడు ఘువారా గ్రామంలో అనేక మంది బాలికలు క్రికెట్ నేర్చుకుంటున్నారని క్రాంతి గౌడ్ ఆనందం వ్యక్తం చేసింది. 'ఇప్పుడు తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడల్లో చేర్చుతున్నారు. ఆటను కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. వన్డే ప్రపంచకప్ విజయం ఈ మార్పుకు ప్రధాన కారణం' అని చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం కీలకం. ఈ నేపథ్యంలో క్రాంతి కూడా తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది.
'నేను బౌలింగ్ చేసే ప్రతి బంతికి నా వంద శాతం ఇవ్వాలని ప్రయత్నిస్తాను. కొత్త డెలివరీలపై పని చేస్తూనే ఉంటా. నాకు వికెట్లు తెచ్చిపెట్టే బలాలపైనే ఎక్కువ దృష్టి పెడతాను' అని క్రాంతి చెప్పింది. తల్లి నగలు అమ్మి కొనిపెట్టిన క్రికెట్ కిట్‌తో మొదలైన క్రాంతి ప్రయాణం.. ఇప్పుడు భారత జట్టు విజయాల కోసం పోరాడే స్థాయికి చేరుకుంది. ఆమె కథ ప్రస్తుతం యువ క్రికెటర్లకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.




