Mohammed Shami: ప్రపంచకప్‌లో 24 వికెట్స్.. దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన.. ఆ స్టార్‌ను ఎందుకు పక్కనపెడుతున్నారు!

Kris Srikkanth criticized BCCI for sidelining Mohammed Shami: భారత జట్టు యాజమాన్యంపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు గుప్పించాడు.

Rishvik
Published on: 25 July 2026 6:17 PM IST
Mohammed Shami
X

Mohammed Shami: ప్రపంచకప్‌లో 24 వికెట్స్.. దేశవాళీల్లో అద్భుత ప్రదర్శన.. ఆ స్టార్‌ను ఎందుకు పక్కనపెడుతున్నారు!

Mohammed Shami: భారత జట్టు యాజమాన్యంపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని అన్ని ఫార్మాట్లలో పూర్తిగా పక్కన పెట్టడాన్ని తప్పుబట్టాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు భారత పేస్ బౌలింగ్ దళంపై చర్చ నడుస్తున్న సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఒకప్పుడు జట్టుకు కీలక బౌలర్‌గా ఉన్న షమీని ఇప్పుడు అస్సలు పట్టించుకోకపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించాడు. షమీ అద్భుతమైన బౌలర్ అని, ప్రపంచ కప్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి అతడిని కూడా పరిశీలించాలని బీసీసీఐకి శ్రీకాంత్ సూచించాడు.

2023 వన్డే ప్రపంచ కప్‌లో మహ్మద్ షమీ 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటివరకు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా షమీ ఆడలేదు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. ఏ సిరీస్‌కూ అతడిని బీసీసీఐ ఎంపిక చేయకపోవడాన్ని క్రిస్ శ్రీకాంత్ ప్రశ్నించాడు. 'ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ వంటి యువ బౌలర్లు మంచి ప్రతిభ కలిగినవారే. వన్డే ప్రపంచ కప్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి వారిని కూడా పరిశీలించాలి. కానీ షమీ అద్భుతమైన బౌలర్. జట్టు యాజమాన్యం అతడిని పూర్తిగా పట్టించుకోవడం లేదు. ఎవ్వరూ కాని వ్యక్తిగా అతడిని మార్చేసింది. ఇది నన్ను ఆశ్చర్యపరుస్తోంది' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు అత్యంత కీలక ఆటగాడు అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు ముందు బుమ్రా వర్క్‌లోడ్‌ను సమర్థంగా నిర్వహించడం చాలా ముఖ్యమని సూచించాడు. 'బుమ్రా భారత క్రికెట్‌కు అమూల్యమైన వజ్రం. అతడు జట్టులో ఉంటేనే ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అతడు లేకపోతే మిగతా బౌలర్లతో భారత్‌కు టైటిల్ గెలవడం చాలా కష్టమవుతుంది. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ కూడా కీలక పాత్ర పోషించగలరు. మంచి జట్టును ఇప్పటినుంచే నిర్మించుకోవడం మంచిది' అని చెప్పాడు.

అర్ష్‌దీప్ సింగ్‌ను వన్డే జట్టులో ఎంపిక చేయకూడదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో స్వింగ్ లభించినప్పుడే అర్ష్‌దీప్ ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని, ఆ తర్వాత అతడిని బ్యాటర్లు సులభంగా ఎదుర్కొంటారని పేర్కొన్నాడు. 'వన్డే క్రికెట్‌కు అర్ష్‌దీప్ సరిపోడు. రెండు ఓవర్ల తర్వాత బంతి స్వింగ్ కాకపోతే అతడి ప్రభావం తగ్గిపోతుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా తొలి ఓవర్ బాగా వేసినా.. ఆ తర్వాత బ్యాటర్లు అతడిని బాగా ఎదుర్కొని పరుగులు చేశారు. ఇటీవల చాలా మ్యాచులలో భారీగా రన్స్ ఇచ్చాడు. అందుకే వన్డే ఫార్మాట్‌కు అతడిని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోకూడదు' అని శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story