Krunal Pandya Injury: కృనాల్ పాండ్యాను అలా చనిపోనివ్వాలి.. మాజీ సీఎస్కే ప్లేయర్ వ్యాఖ్యలపై పెను దుమారం!

S Badrinath Trolls on comment on Krunal Pandya. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి.

Rishvik
Published on: 11 May 2026 6:46 PM IST
Krunal Pandya Injury
X

Krunal Pandya Injury: కృనాల్ పాండ్యాను అలా చనిపోనివ్వాలి.. మాజీ సీఎస్కే ప్లేయర్ వ్యాఖ్యలపై పెను దుమారం!

Krunal Pandya Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం మాజీ భారత క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. కామెంటరీ చేస్తూ కృనాల్ పాండ్యకు వచ్చిన క్రాంప్స్‌ (కండరాలు పట్టేయడం)పై బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆర్సీబీ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ‘అతడిని అలాగే చనిపోనివ్వాలి’ అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

167 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ టాప్ ఆర్డర్ కుప్పకూలిన సమయంలో కృనాల్ పాండ్య ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అతడికి తీవ్రంగా క్రాంప్స్ వచ్చాయి. కాళ్ల నొప్పితో కృనాల్ మైదానంలో కిందపడిపోగా.. ముంబై వికెట్ కీపర్ రియన్ రికెల్టన్ వెంటనే వచ్చి సహాయం చేశాడు. ఆపై ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఈ సమయంలో తమిళ కామెంటరీ చేస్తోన్న ఎస్ బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘చూడండి అతడికి ఇప్పటికే క్రాంప్స్ వచ్చాయి. ప్రత్యర్థి జట్టు అయితే.. ఆ క్రాంప్స్‌తోనే చనిపోనివ్వాలి అనుకుంటుంది. కానీ రికెల్టన్ మాత్రం సహాయం చేశాడు’ అంటూ బద్రీనాథ్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. కామెంటరీలో సరదాగా చెప్పిన వ్యాఖ్యగా భావించినప్పటికీ.. అభిమానులు మాత్రం తీవ్రంగా స్పందించారు. ఒక మాజీ భారత క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. కొందరు ఆ వ్యాఖ్యలను అమానుషంగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు కామెంటరీలో కూడా హద్దులు ఉండాలని అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల కింద ఆర్సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘క్రాంప్స్‌తో ఉన్న ఆటగాడిని చనిపోనివ్వాలా? ఇది ఫన్నీ కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కొందరు మాత్రం బద్రీనాథ్ వ్యాఖ్యలను అతిగా తీసుకోవద్దని, ప్రత్యర్థి జట్టు కోణంలో సరదాగా చెప్పాడని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇక మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్య తన క్రాంప్స్‌పై స్పందించాడు. ‘క్రాంప్స్ చాలా తీవ్రంగా వచ్చాయి. కాఫ్, హామ్‌స్ట్రింగ్, గ్లూట్స్.. రెండు కాళ్లూ బాగా నొప్పించాయి. కానీ నేను బయటకు వెళ్లాలని అనుకోలేదు. జట్టు కోసం ఎంతవరకు సాధ్యమో అంతవరకు పోరాడాలని నిర్ణయించుకున్నా. టోర్నీ చివరి దశలో ప్రతి మ్యాచ్ కీలకం. అందుకే నొప్పిని తట్టుకుని బ్యాటింగ్ కొనసాగించా’ అని తెలిపాడు.

కృనాల్ పాండ్య తన ఆట గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ పోరాటాన్ని వదిలేసే ఆటగాడిని కాదు. కఠిన పరిస్థితుల్లో ఆడటాన్ని ఇష్టపడతా. ఈ ఇన్నింగ్స్ పూర్తిగా విల్‌పవర్‌, ధైర్యంతో ఆడినదే’ అని కృనాల్ పేర్కొన్నాడు. అతడి పోరాట ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ చివరి బంతికి థ్రిల్లింగ్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మరో రెండు విజయాలు సాధిస్తే.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ సొంతం అవుతుంది. ఒక్క విజయం సాదించినా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆడడం ఖాయం. అయితే టాప్ 2లో నిలిచే అవకాశాలు తక్కువ.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story