Krunal vs Hardik Pandya: తమ్ముడు హార్దిక్‌ పాండ్యతో విభేదాలు.. అన్న కృనాల్ ఏమన్నాడంటే?

Krunal vs Hardik Pandya: తాజాగా ఆర్సీబీ పోడ్కాస్ట్‌లో డానిష్ సైత్‌తో మాట్లాడిన కృనాల్ పాండ్య.. తన తమ్ముడు హార్దిక్ పాండ్యతో గొడవ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

Rishvik
Published on: 22 April 2026 7:00 PM IST
Krunal vs Hardik Pandya
X

Krunal vs Hardik Pandya: తమ్ముడు హార్దిక్‌ పాండ్యతో విభేదాలు.. అన్న కృనాల్ ఏమన్నాడంటే?

Krunal vs Hardik: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ (ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్య ఔటైన తర్వాత ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ కృనాల్ పాండ్య పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. అన్న కృనాల్‌ను అదే తీరుగా చూస్తూ.. తమ్ముడు హార్దిక్‌ పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో అన్నదమ్ములు కృనాల్, హార్దిక్‌ మధ్య విభేదాలు ఉన్నాయని నెటిజెన్స్ కొత్త చర్చకు తెర లేపారు.

తాజాగా ఆర్సీబీ పోడ్కాస్ట్‌లో డానిష్ సైత్‌తో మాట్లాడిన కృనాల్ పాండ్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తమ బంధంపై వస్తోన్న వార్తలను కృనాల్ కొట్టిపడేశాడు. మీ అన్నదమ్ముల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఏమైనా చెడిందా? అని డానిష్ సైత్‌ సరదాగా అడగగా.. కృనాల్ ఒక్కసారిగా నవ్వేశాడు. 'అంతా ఓకే' అని సమాధానం ఇచ్చాడు. అది కేవలం మ్యాచ్ అని, కీలక సమయంలో భావోద్వేగాలు అలానే ఉంటాయని చెప్పుకొచ్చాడు. దీంతో అన్నదమ్ములు కృనాల్, హార్దిక్‌ మధ్య విభేదాలన్న వార్తలకు చెక్ పడింది. గతంలో ఇద్దరు ముంబై తరఫున ఆడిన విషయం తెలిసిందే.

లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జింగ్ చేశాడనే ఆరోపణలపై కూడా కృనాల్ పాండ్య వివరణ ఇచ్చాడు. 'నేను ముకుల్ చౌదరితో సరదాగా మాట్లాడాను అంతే. అతడు మొదటి బంతికే ప్యాడిల్ షాట్ ఆడాడు. నువ్వు మంచి షాట్లు ఆడగలవు, లాంగ్ ఆన్ లేదా లాంగ్ ఆఫ్ మీద సిక్సులు కొట్టు అని చెప్పాను. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను స్లెడ్జ్‌ చేసినట్లు బయట నుంచి చాలా మంది విమర్శిస్తున్నారు. నిజానికి నేను స్లెడ్జింగ్‌ చేయలేదు. అతడు కూడా నవ్వేశాడు. అదంతా సరదాగా అన్నదే. నేను చాలా సీరియస్‌గా ఉంటానని, కోపమెక్కువని అందరూ అనుకుంటారు. కానీ నేను చాలా కూల్' అని కృనాల్ పాండ్య చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో కృనాల్ పాండ్య ఆర్సీబీకి కీలక ఆటగాడిగా మారాడు. తన బౌలింగ్‌లో కొత్త మార్పులు చేసి.. బ్యాట్స్‌మన్‌లను ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్‌గా బౌన్సర్లు వేస్తూ వికెట్స్ పడగొడుతున్నాడు. అలాగే అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయం చేస్తున్నాడు. ఇక ఆర్సీబీ ఈ సీజన్‌ను మంచి ఫామ్‌తో ప్రారంభించింది. కృనాల్ తన ప్రదర్శనతో భారత జట్టులోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. అతని ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడం పెద్ద విషయం కాకపోవచ్చు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story