Video: బ్యాటర్‌కు షాకిచ్చిన కుల్దీప్.. ఆ మ్యాజిక్ బాల్ చూస్తే బుర్ర బద్దలవ్వాల్సిందే..!

Video: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఇంగ్లాండ్ గడ్డపై మరోసారి తన సత్తా చాటాడు. యార్క్‌షైర్ (Yorkshire) తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్న అతడు ఎసెక్స్‌పై ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు.

Venkat
Published on: 12 Sept 2026 10:43 AM IST
Video
X

Video: బ్యాటర్‌కు షాకిచ్చిన కుల్దీప్.. ఆ మ్యాజిక్ బాల్ చూస్తే బుర్ర బద్దలవ్వాల్సిందే..!

Video: ఇంగ్లాండ్‌లో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్పిన్ మాయ కొనసాగుతోంది. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో యార్క్‌షైర్ తరఫున బరిలోకి దిగిన భారత స్పిన్నర్ ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు.

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత పదునైన బౌలింగ్ చేశాడు. కేవలం 50 పరుగులకే 6 వికెట్లు తీశాడు. మొత్తంగా 120 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. అతడి ప్రదర్శనతో యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బంతితో మెరిసిన కుల్దీప్ బ్యాట్‌తోనూ ఉపయోగకరమైన పరుగులు చేశాడు. తన ఏకైక ఇన్నింగ్స్‌లో 36 పరుగులు సాధించాడు. మ్యాచ్‌లో అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టు విజయానికి కీలకంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ వేసిన ఓ బంతి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. జమాన్ అక్తర్ (Zaman Akhter)కు అతడు ఆఫ్‌స్టంప్‌కు చాలా వెలుపల బంతిని వేశాడు. దాన్ని వదిలేయాలనే ఉద్దేశంతో బ్యాటర్ బ్యాట్‌ను పక్కకు పెట్టాడు. కానీ ఊహించని విధంగా బంతి లోపలికి మలుపు తిరిగి నేరుగా వికెట్లను తాకింది. దీంతో జమాన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

మ్యాచ్ తరువాత కుల్దీప్ తన బౌలింగ్‌పై ఆసక్తికర విషయాలు చెప్పాడు. పిచ్‌లో సహజంగానే వేగం ఉండటంతో ఎక్కువ వేగంగా బంతులు వేయాల్సిన అవసరం లేదని వివరించాడు. బంతికి ఎక్కువ స్పిన్ ఇస్తూ సరైన ప్రదేశంలో పడేయడమే తన వ్యూహమని పేర్కొన్నాడు.

భారత పరిస్థితులతో పోలిస్తే ఇంగ్లాండ్ పిచ్‌లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని కుల్దీప్ చెప్పాడు. అక్కడి పిచ్‌లపై వేగం కారణంగా బ్యాటర్లు వెనుక కాలు ఉపయోగిస్తే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందని వివరించాడు.

కుల్దీప్ భారత్ తరపున ఇప్పటివరకు 19 టెస్టులు ఆడి 80 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇటీవల జాతీయ జట్టు తుది కూర్పులో స్థానం కోసం పోటీ ఎదుర్కొంటున్న అతడికి కౌంటీ క్రికెట్‌లో ఈ ప్రదర్శన మంచి ఊపునిచ్చింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.