LA Olympics 2028: ఒలింపిక్స్‌కు అర్హత విధానంను ప్రకటించిన ఐసీసీ!

LA Olympics 2028: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028 కోసం అర్హత సాధించే విధానాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

Rishvik
Published on: 29 Jun 2026 7:05 PM IST
LA Olympics 2028
X

LA Olympics 2028: ఒలింపిక్స్‌కు అర్హత విధానంను ప్రకటించిన ఐసీసీ!

LA Olympics 2028: 100 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ మరలా ఒలింపిక్స్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028 కోసం అర్హత సాధించే విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. పురుషులు, మహిళల విభాగాల్లో తలా ఆరు జట్లు మాత్రమే ఒలింపిక్స్‌లో పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్లు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయనే దానిపై స్పష్టత వచ్చింది. భారత పురుషుల జట్టు నేరుగా అర్హత పొందాలంటే 2026 చివరి నాటికి ఆసియాలో అత్యుత్తమ టీ20 జట్టుగా నిలవాల్సి ఉంటుంది.

పురుషుల జట్లకు ఇదే అర్హత విధానం:

ఐసీసీ ప్రకటించిన నిబంధనల ప్రకారం.. 2026 డిసెంబర్ 31 నాటికి ఉన్న ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా నాలుగు ఖండాల నుంచి ఒక్కో అత్యుత్తమ జట్టుకు నేరుగా ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. అంటే ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఓషియానియా లేదా ఇతర ఖండాల నుంచి టాప్ ర్యాంక్ కలిగిన జట్లు అర్హత సాధిస్తాయి. భారత్ నేరుగా ఒలింపిక్స్‌కు వెళ్లాలంటే ఆసియా ఖండంలో అత్యధిక ర్యాంక్ ఉన్న జట్టుగా నిలవాల్సి ఉంటుంది.

మహిళల జట్లకు ప్రపంచకప్ కీలకం:

మహిళల విభాగంలో మాత్రం అర్హత ప్రక్రియ భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న 2026 టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ స్టాండింగ్స్ ఆధారంగా నాలుగు ఖండాల నుంచి అత్యుత్తమ జట్లకు నేరుగా ఒలింపిక్ కోటా లభిస్తుంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా (ఓషియానియా), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా), ఇంగ్లండ్ (యూరప్) జట్లు అర్హత సాధించాయి. భారత మహిళల జట్టు కూడా అర్హత సాధించింది.

అమెరికాకు నేరుగా బెర్త్:

ఒలింపిక్స్ ఆతిథ్య దేశమైన అమెరికాకు పురుషులు, మహిళల విభాగాల్లో ఒక్కో స్థానం కేటాయించారు. అయితే అర్హత కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కనీసం టాప్-15లో ఉండాలనే షరతును అమెరికాకు ఉంది. టాప్-15 లోపల ఉంటే యూఎస్ జట్లకు ఆటోమేటిక్‌గా ఒలింపిక్స్‌లో చోటు దక్కుతుంది. నేరుగా అర్హత సాధించని జట్లకు మరో అవకాశం కూడా ఉంది. ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపికయ్యే తదుపరి ఎనిమిది అత్యుత్తమ జట్లు ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో తలపడతాయి. అక్కడ విజేతగా నిలిచే జట్టుకు చివరి ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది. ఈ టోర్నమెంట్ తేదీలను ఐసీసీ తర్వాత ప్రకటించనుంది.

వెస్టిండీస్‌కు ప్రత్యేక నిబంధన:

వెస్టిండీస్ ఒకే దేశం కాకుండా పలు కరేబియన్ దేశాల సమాఖ్యగా ఉండటంతో ఒలింపిక్స్‌లో ఒకే జట్టుగా పాల్గొనే అర్హత లేదు. ఒకవేళ వెస్టిండీస్ గ్లోబల్ క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తే.. ఆ ప్రాంతానికి చెందిన దేశాల మధ్య ప్రత్యేక ప్రాంతీయ టోర్నీ నిర్వహించి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే దేశాన్ని ఎంపిక చేస్తామని ఐసీసీ తెలిపింది.

జై షా స్పందన:

ఐసీసీ ఛైర్మన్ జే షా మాట్లాడుతూ.. 100 ఏళ్ల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లోకి తిరిగి రావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ 2028 కోసం అర్హత మార్గాన్ని ప్రకటించడం ద్వారా సభ్య దేశాలకు స్పష్టమైన దిశానిర్దేశం లభించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత విస్తరించడానికి, కొత్త అభిమానులను ఆకర్షించడానికి ఒలింపిక్స్ వేదిక ఎంతో కీలకమవుతుందని షా అభిప్రాయపడ్డారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story