Lalit Modi: సచిన్, ద్రవిడ్, గంగూలీని నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!

Lalit Modi: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Rishvik
Published on: 4 Jun 2026 7:56 PM IST
Lalit Modi
X

Lalit Modi: సచిన్, ద్రవిడ్, గంగూలీని నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!

Lalit Modi: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా.. ఎంఎస్ ధోనీ అద్భుత నాయకత్వంలో కప్ గెలిచింది. ఈ టీ20 ప్రపంచ కప్‌ గురించి మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొలి టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత సీనియర్ ఆటగాళ్లను తాను వ్యక్తిగతంగా సంప్రదించి టోర్నీలో పాల్గొనాలని కోరినా.. వారు పెద్దగా ఆసక్తి చూపలేదని చెప్పారు. ఆ సమయంలో చాలామంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌ను 'వింత ఆట'గా భావించారని ఆయన పేర్కొన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లలిత్ మోడీ.. 2007లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 'టీ20 ప్రపంచకప్ ఆడాలని నేను ప్రతి ఆటగాడిని వేడుకున్నాను. అప్పుడు భారత జట్టులో ఉన్న సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు తొలి టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని కోరాను. కానీ చాలా మంది ఇది ఏంటి కొత్త ఆట?, మేము అలసిపోయాం, కుటుంబంతో సమయం గడపాలి అంటూ ఆసక్తి చూపలేదు. బదులుగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంఎస్ ధోనీ నాయకత్వంలో దక్షిణాఫ్రికాకు వెళ్లింది. ఆ నిర్ణయం అప్పట్లో చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కానీ అదే జట్టు చరిత్ర సృష్టించి ప్రపంచకప్ గెలిచింది'

'ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచ కప్‌కు భారత జట్టు బదులుగా బీ టీమ్‌ను పంపితే అభిమానులు ఒప్పుకుంటారా?, బీసీసీఐ అంగీకరిస్తుందా?. అసలు అలాంటి ఆలోచన కూడా చేయలేం. కానీ 2007లో మాత్రం అలా జరిగింది. ఏదేమైనా భారత్ కప్ గెలిచి సంచలనం సృష్టించింది' అని లలిత్ మోడీ చెప్పారు. 'టీ20 క్రికెట్‌కు మొదట్లో భారతదేశంలో పెద్దగా ఆదరణ లేదు. ప్రేక్షకులు లేకపోతే ప్రకటనలు రావని, ప్రకటనలు లేకపోతే డబ్బు రాదని అన్నారు. అందుకే టీ20 ఫార్మాట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేను ఎంతో కృషి చేశాను' ఆయన తెలిపారు.

2007 టీ20 ప్రపంచకప్ ప్రారంభ దశలో టోర్నీకి పెద్దగా వీక్షకులు లేరని, కానీ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ అన్నారు. ఆ సంఘటనతో ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు అపారమైన గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. 2007లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్.. నేడు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టోర్నీల్లో ఒకటిగా మారింది. ఆ మార్పుకు ధోనీ సేన విజయం, యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కీలక మలుపుగా నిలిచాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story