Laxman Shivaramakrishnan: నన్నెవరూ పెళ్లి చేసుకోలేదు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆవేదన!

Laxman Shivaramakrishnan: భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా టీనేజ్‌లోనే మద్యం, డ్రగ్స్‌కు బానిస అన్న ముద్ర శివరామకృష్ణన్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

Rishvik
Published on: 26 March 2026 7:28 PM IST
Laxman Shivaramakrishnan
X

Laxman Shivaramakrishnan: నన్నెవరూ పెళ్లి చేసుకోలేదు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆవేదన!

Laxman Shivaramakrishnan: భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆయనకు ప్రతిభతో పాటు అనవసర ఆరోపణలు, విమర్శలు పెద్ద సవాలుగా మారాయి. ముఖ్యంగా టీనేజ్‌లోనే మద్యం, డ్రగ్స్‌కు బానిస అన్న ముద్ర శివరామకృష్ణన్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. తనను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాలేదని శివరామకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బీసీసీఐ కామెంటరీ ప్యానెల్‌ నుంచి ఆయన బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

17 ఏళ్లకే భారత్ తరఫున ఆడిన లక్ష్మణ్ శివరామకృష్ణన్.. 16 నుంచి 19 ఏళ్ల మధ్య విదేశీ టూర్లకు వెళ్లిన సమయంలోనే వచ్చిన ఆరోపణలు తన కెరీర్‌ను దెబ్బతీశాయని చెప్పారు. 'అప్పుడు నేను మైనర్‌ను. హోటళ్లలో ఎవరు నాకు మద్యం ఇస్తారు? చెప్పండి. నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. కానీ 19 ఏళ్లకే నన్ను ఆల్కహాలిక్‌గా పిలిచారు. ఆ ఆరోపణలు నా వ్యక్తిగత జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపాయి. నా తల్లిదండ్రులు పెళ్లి కోసం ప్రకటన ఇచ్చినా ఒక్క సంబంధం కూడా రాలేదు. నా గురించి చెడు ప్రచారం అంతగా జరిగిపోయింది. ఎవరూ తమ కుమార్తెను నాకు ఇచ్చేందుకు ముందుకు రాలేదు' అని శివరామకృష్ణన్ భావోద్వేగం చెందారు.

క్రికెట్ కెరీర్ ముగింపు కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్‌కు నిరాశ కలిగించింది. 1987 వరల్డ్ కప్ తర్వాత జట్టులోంచి తప్పించేందుకు సెలెక్టర్లు ఫిట్‌నెస్ కారణం చెప్పమని ఒత్తిడి చేశారని, కానీ తాను అలా చేయలేదని చెప్పారు. 'మీరు నన్ను డ్రాప్ చేయండి.. కానీ నేను అబద్ధం చెప్పను' అని స్పష్టం చేసినట్లు తెలిపారు. క్రికెట్ తర్వాత కామెంటేటర్‌గా కొనసాగిన ఆయన జీవితంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా డిప్రెషన్ పెరిగిందని తెలిపారు. 'ఆ సమయంలో మానసికంగా పూర్తిగా కుంగిపోయా. నిద్రపోవడానికి మద్యం తాగేవాడిని. కొన్నిసార్లు చావాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. నాకు హాల్యూసినేషన్స్ కూడా వచ్చేవి. కళ్లను మూసుకున్నప్పుడు భయంకర దృశ్యాలు కనిపించేవి. మనసులో మళ్లీ మళ్లీ చావాలనే ఆలోచనలు వచ్చేవి. బయట వాళ్లు మాత్రం ఇదంతా మద్యం వల్లేనని అనుకున్నారు' అంటూ శివరామకృష్ణన్‌ ఫీల్ అయ్యారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఈ సంఘటనలు మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తాయని శివరామకృష్ణన్ పేర్కొన్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story