నా హిస్టరీ బ్రేక్ చేసే దమ్ముందా బుడ్డోడా.. వైభవ్‌ను సవాల్ చేసిన సఫారీ కుర్రాడు..!
South Africa vs Namibia T20: ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశం తరపున అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రిటోరియస్ (20 ఏళ్ల 161 రోజులు) సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు.
నా హిస్టరీ బ్రేక్ చేసే దమ్ముందా బుడ్డోడా.. వైభవ్‌ను సవాల్ చేసిన సఫారీ కుర్రాడు..!
Lhuan-dre Pretorius: నమీబియా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఆతిథ్య నమీబియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ లూహాన్ ప్రిటోరియస్ 53 బంతుల్లో 8 సిక్సర్లతో 101 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐసీసీ పూర్తి స్థాయి సభ్య దేశం తరపున అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రిటోరియస్ (20 ఏళ్ల 161 రోజులు) సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు 20 ఏళ్ల 337 రోజుల వయసులో సెంచరీ సాధించిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉండేది.
భారీ స్కోరుతో కదం తొక్కిన సఫారీలు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు లూహాన్ ప్రిటోరియస్ (101), కానర్ ఎస్తర్ హుజెన్ (40 బంతుల్లో 88, 8 సిక్సర్లు) ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్‌కు కేవలం 11.3 ఓవర్లలోనే 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు పటిష్టమైన పునాది వేసింది. నమీబియా బౌలర్లలో జాన్ బాల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు.
పోరాడి ఓడిన నమీబియా..
అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు జాన్ ఫ్రైలింగ్ (36 బంతుల్లో 72), లారెన్ స్టిన్‌క్యాంప్ (44 బంతుల్లో 61) జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 217 పరుగులకు పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్ నోబాని ముకోనా రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్ సమరంలో జింబాబ్వేతో దక్షిణాఫ్రికా తలపడనుంది.




