LSG vs RCB : లక్నో సూపర్ విక్టరీ.. ఆర్‌సీబీపై 9 పరుగుల తేడాతో గెలుపు
LSG vs RCB : ఐపీఎల్ 2026లో లక్నో ఘనవిజయం. మిచెల్ మార్ష్ సెంచరీ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ మెరుపులతో ఆర్‌సీబీపై 9 పరుగుల తేడాతో గెలిచి వరుస ఓటములకు చెక్ పెట్టింది.
LSG vs RCB
LSG vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో 9 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత లక్నోకు దక్కిన ఈ విజయం, ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచింది. వర్షం కారణంగా మూడుసార్లు ఆగిపోయిన ఈ మ్యాచ్‌ను అంపైర్లు ఇరు జట్లకు 19 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ మైదానంలో ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లోనే 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. ఏకానా స్టేడియంలో బెంగళూరు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన మార్ష్, ఈ సీజన్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. నికోలస్ పూరన్ (38), కెప్టెన్ రిషబ్ పంత్ (32 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
డిఎల్‌ఎస్ (DLS) పద్ధతి ప్రకారం బెంగళూరుకు 19 ఓవర్లలో 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీకి ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. మొహమ్మద్ షమీ తొలి ఓవర్‌లోనే బెథెల్‌ను అవుట్ చేయగా, రెండో ఓవర్‌లో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ సంచలనం సృష్టించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పరుగులేమీ చేయకుండానే క్లీన్ బౌల్డ్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ మొత్తం 3 వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (61), టెర్రరిక్ ఫామ్‌లో ఉన్న టిమ్ డేవిడ్ (40) పోరాడినప్పటికీ, కీలక సమయంలో షాబాజ్ అహ్మద్ వీరిద్దరినీ అవుట్ చేసి ఆర్‌సీబీని దెబ్బకొట్టాడు. చివర్లో క్రునాల్ పాండ్యా 16 బంతుల్లో 28 పరుగులతో ఆశలు రేకెత్తించినా, చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమైన దశలో దిగ్వేష్ రాఠీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నోకు 9 పరుగుల విజయాన్ని అందించాడు. ఆర్‌సీబీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేయగలిగింది.




