LSG vs DC: చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. అల్లాడిన హిట్టర్లు, స్వల్ప స్కోరుకే లక్నో ఆలౌట్!

DC bowlers dominate as LSG: ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ల దెబ్బకు లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది.

Rishvik
Published on: 1 April 2026 10:04 PM IST
LSG vs DC IPL 2026
X

LSG vs DC IPL 2026

DC bowlers dominate as LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026లో భాగంగా లక్నోలో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్ల దెబ్బకు లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీ ముందు 142 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్ (36) టాప్ స్కోరర్లు. లక్నో మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, టి.నజరాజన్‌ మూడేసి వికెట్స్ పడగొట్టగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు వికెట్స్ తీశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ ఎంచుకుంది. దాంతో లక్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. లక్నోకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లుగా మిచెల్‌ మార్ష్‌, రిషభ్‌ పంత్‌ వచ్చారు. అయితే లక్నో ప్రయోగం ఆదిలోనే బెడిసికొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టార్ బ్యాటర్ ఐడెన్‌ మార్‌క్రమ్‌ (11) నిరాశపర్చాడు. ఆ వెంటనే ఆయుష్‌ బదోని డకౌట్ కాగా.. విండీస్ హిట్టర్ నికోలస్‌ పూరన్‌ (8) మెరుపులు మెరిపించలేకపోయాడు. కీలక ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో లక్నో ఒత్తిడిలో పడింది. మరో ఓపెనర్ మార్ష్‌ మాత్రం వికెట్ కాపాడుకుంటూ విలువైన రన్స్ జోడించాడు.

75 పరుగుల వద్ద మిచెల్‌ మార్ష్‌ కూడా అవుట్ అవ్వడంతో లక్నో పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో అబ్దుల్ సమద్ జట్టును ఆదుకున్నాడు. అతడికి ముఖుల్ చౌదరి (14), షాబాజ్ అహ్మద్ (15) అండగా నిలిచారు. లుంగి ఎంగిడి, నజరాజన్‌ రెచ్చిపోవడంతో లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఇనింగ్స్ చివర్లో వికెట్లు త్వరత్వరగా పడిపోవడంతో లక్నో ఇన్నింగ్స్ త్వరగా ముగిసింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు హిట్టర్లు రిషభ్‌ పంత్‌, ఐడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోనిలు విలవిల్లాడిపోయారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story