Manav Suthar: ఐపీఎల్ కోసం కకృతి పడొద్దు.. మానవ్ సుతార్‌కు టీమిండియా దిగ్గజం కీలక సూచన!

Cheteshwar Pujara on Manav Suthar. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌కు భారత మాజీ బ్యాటర్ చతేశ్వర్ పుజారా కీలక సూచన చేశాడు.

Rishvik
Published on: 20 Aug 2026 5:54 PM IST
Manav Suthar
X

Manav Suthar: ఐపీఎల్ కోసం కకృతి పడొద్దు.. మానవ్ సుతార్‌కు టీమిండియా దిగ్గజం కీలక సూచన!

Manav Suthar: శ్రీలంకతో గాలె మైదానంలో జరిగిన తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం రెండో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న సుతార్.. టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి.. మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. సుతార్ అద్భుత బౌలింగ్‌తో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ విజయంతో గిల్ సేన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఆగస్ట్ 23 నుంచి కొలంబోలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది.

అఫ్గానిస్థాన్‌తో జూన్‌లో జరిగిన టెస్టు ద్వారా మానవ్ సుతార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇప్పుడు గాలె టెస్టులోనూ అదరగొట్టడంతో.. అతడి ప్రతిభపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా యువ స్పిన్నర్ సుతార్‌కు కీలక సూచన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం తన సహజ శైలిని బౌలింగ్ మార్చుకోవద్దని సూచించాడు. సుతార్‌ను టెస్టు క్రికెట్ కోసం ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం బీసీసీఐకి ఉందని పుజారా అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు టీ20 క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్ వైపు ఆకర్షితులవడం సహజమేనని.. అయితే సుతార్ తన సహజ బౌలింగ్ శైలిని అస్సలు మార్చుకోకూడదని సలహా ఇచ్చాడు.

'మానవ్ సుతార్‌ను టెస్టు ఫార్మాట్ కోసం మనం కాపాడుకోవాలి. యువ ఆటగాళ్లు షార్ట్ ఫార్మాట్ ఆడాలని కోరుకోవచ్చు. సుతార్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే తప్పకుండా ఆడొచ్చు. కానీ ఐపీఎల్ కోసం అతడి బలాన్ని మార్చుకోవద్దు. సుతార్ బౌలింగ్‌లోని ప్రధాన బలం.. బంతిని ఫ్లైట్ చేయడమే. టెస్టుల్లో అదే శైలిని కొనసాగించాలి.

వైట్ బాల్ క్రికెట్‌లో అవసరాన్ని బట్టి బంతిని కాస్త ఫ్లాట్‌గా వేయొచ్చు. అయితే ఐపీఎల్ కోసం తనను తాను మార్చుకోకూడదు. తన సహజ ప్రతిభను, బంతిని ఫ్లైట్ చేసే శైలిని కొనసాగించాలి' అని చతేశ్వర్ పుజారా పేర్కొన్నాడు.

ప్రస్తుతం సుతార్ ఐపీఎల్‌లోనూ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గాలె టెస్టులో సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకోగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో చెలరేగాడు.

మొత్తంగా 10 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్‌లో అతడి ఆరంభం అద్భుతంగా ఉండటంతో.. భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో సుతార్ కీలక బౌలర్‌గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story