Manav Suthar: నేను టీమిండియాకు సెలెక్ట్ అయ్యానా?.. నాకు ఇప్పటికీ ఓ కలలా ఉంది!

Manav Suthar on His Debut 7 Wickets. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్ల ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న మానవ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Rishvik
Updated on: 8 Jun 2026 5:37 PM IST
Manav Suthar: నేను టీమిండియాకు సెలెక్ట్ అయ్యానా?.. నాకు ఇప్పటికీ ఓ కలలా ఉంది!
X

Manav Suthar: అఫ్గానిస్థాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయం అందుకుంది. టీమిండియా విజయంలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్ల అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న మానవ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం తన జీవితకాల స్వప్నమని, అది ఇప్పుడు నెరవేరిందని తెలిపాడు. భారత జట్టు టెస్ట్ క్యాప్ అందుకున్న క్షణం ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని, అంతా ఓ కలలా ఉందని మానవ్ చెప్పుకొచ్చాడు.

టెస్ట్ క్రికెట్‌లో ఆడడం నా చిన్ననాటి కల:

మ్యాచ్ అనంతరం మాట్లాడిన మానవ్ సుతార్.. 'భారత్ తరఫున ఆడటం, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో ఆడడం నా చిన్ననాటి కల. టెస్ట్ క్యాప్ అందుకున్న క్షణం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అది నిజంగా ఓ కలలా అనిపించింది. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఒత్తిడికి గురికాలేదు. క్రీజులో కొంతసేపు గడిపిన తర్వాత పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోందని అర్థమైంది. అనంతరం బౌలింగ్‌కు వచ్చినప్పుడు కూడా అదే అనుభూతి కలిగింది. దాంతో సరైన లైన్ అండ్ లెంగ్త్, వేగంతో బౌలింగ్ చేయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టాను' అని వెల్లడించాడు.

స్టాక్ బాల్‌పైనే ఆధారపడుతా:

ముందుగా తన స్టాక్ బాల్‌పైనే ఎక్కువగా ఆధారపడ్డానని మానవ్ చెప్పాడు. 'ముందుగా పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవాలనుకున్నాను. అందుకే నా సహజ బంతులనే ఎక్కువగా వేశాను. తర్వాత వికెట్ కొంచెం నెమ్మదిగా ఉందని గుర్తించి.. వేగంలో కాస్త మార్పులు చేశాను. నా ప్రధాన లక్ష్యం మాత్రం స్టాక్ బాల్‌ను మరింత ప్రభావవంతంగా వేయడమే' అని వివరించాడు. 'మ్యాచ్‌లో రెండో కొత్త బంతిని అందుకోవడం నాకు ఎంతో గర్వకారణం. జట్టు నాపై ఉంచిన నమ్మకానికి అది నిదర్శనం. ఎల్బీడబ్ల్యూ అప్పీల్ ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం. నా కోణం నుంచి చూస్తే బ్యాటర్ అవుట్‌ అయినట్లు అనిపించాడు. అందుకే రివ్యూ తీసుకోవాలని అనిపించింది' అని నవ్వుతూ చెప్పాడు.

ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి:

ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకున్న అతిపెద్ద పాఠం గురించి అడిగినప్పుడు మానవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'టెస్ట్ క్రికెట్‌లో విజయానికి ప్రధాన మంత్రం నిలకడ. ఒకే ప్రాంతంలో పదేపదే బంతులు వేయాలి. ఓర్పుతో మీ ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. టెస్ట్ క్రికెట్ చాలా సహనాన్ని పరీక్షించే ఫార్మాట్. సరైన లైన్ అండ్ లెంగ్త్‌ను నిరంతరం కొనసాగిస్తేతేనే విజయం సాధించవచ్చు' అని వివరించాడు. అఫ్గానిస్థాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 6/33 గణాంకాలు నమోదు చేసిన మానవ్.. మ్యాచ్ మొత్తం 7 వికెట్లు తీసి భారత జట్టుకు ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్‌లో భవిష్యత్తు స్పిన్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story