Manish Pandey: కోహ్లీ, రోహిత్ సరసన మనీశ్ పాండే.. ఐపీఎల్‌లో అరుదైన ఘనత!
Manish Pandey: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వెటరన్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
Manish Pandey: కోహ్లీ, రోహిత్ సరసన మనీశ్ పాండే.. ఐపీఎల్‌లో అరుదైన ఘనత!
Manish Pandey: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వెటరన్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లోని ప్రతి ఎడిషన్‌లోనూ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడిన మూడో ఆటగాడిగా మనీశ్ నిలిచాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మాత్రమే ప్రతి ఎడిషన్‌లో ఆడారు. ఆ ఇద్దరే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ సీజన్లో నేడు కేకేఆర్ తరఫున బరిలోకి దిగడంతో మనీశ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
2008లో ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం 19వ ఎడిషన్ నడుస్తోంది. ఈ 19 సీజన్ల పాటు టీమిండియా దిగజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రతి ఎడిషన్‌లో ఆడారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా మొదటి సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ.. ప్రస్తుత ఎడిషన్‌లో ఇంకా మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2026లో ఇప్పటికే లీగ్ దశ సగం పూర్తి కాగా.. మనీశ్ పాండే ఈరోజు కేకేర్ తరఫున సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ కోసం తుది జట్టులో చోటు సంపాదించాడు. దాంతో అన్ని సీజన్లలో మైదానంలోకి దిగిన ప్లేయర్‌గా నిలిచాడు.
37 ఏళ్ల మనీశ్ పాండే ఐపీఎల్‌లో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 174 మ్యాచ్‌లు ఆడి 3,942 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 121.52గా ఉంది. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడు మనీష్ కావడం విశేషం. 2014 ఐపీఎల్ ఫైనల్‌లో 94 పరుగులు చేసి.. పంజాబ్ జట్టుపై కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు.
మనీశ్ పాండే భారతదేశం తరపున 29 వన్డేలు, 39 టీ20లలో ప్రాతినిధ్యం వహించాడు. 2018 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఇక ఐపీఎల్‌లో 174 మ్యాచులు ఆడాడు. గత కొన్ని సీజన్లుగా మనీశ్‌కు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. 2024 సీజన్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అతను.. గతేడాది మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే కనిపించాడు. ఈ ఏడాది ఒకే మ్యాచ్ ఆడి అరుదైన ఘనతను అందుకున్నాడు.




