Manu Bhaker-India: భారత్ ఎలా స్పోర్టింగ్ నేషన్ అవుతుంది?.. తెరపైకి మను భాకర్, వైభవ్ సూర్యవంశీ ఎపిసోడ్!

Manu Bhaker’s viral interaction on Vaibhav Sooryavanshi. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవంలో భారత స్టార్ షూటర్ మను బాకర్‌ తాజాగా పాల్గొంది.

Rishvik
Published on: 28 April 2026 3:41 PM IST
Manu Bhaker-India
X

Manu Bhaker-India

Manu Bhaker-India: నిజమైన 'స్పోర్టింగ్ నేషన్'గా ఎదగాలని భారత్ తరచూ చెప్పుకుంటుంది. వాస్తవంగా చూస్తే.. భారత్‌లో క్రికెట్‌ను మించి ఇతర క్రీడలకు సమాన ప్రాధాన్యం లేదనేది వాస్తవం. టెన్నిస్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, హాకీ, కబడ్డీ, కోకో, బాక్సింగ్.. ఇలా ఎన్నో క్రీడలు ఉన్నా భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. మిగతా క్రీడల్లో దిగ్గజాలు ఉన్నా.. మనకు క్రికెట్ దిగ్గజాలు మాత్రమే గుర్తుంటారు. క్రికెట్‌ను మించి ఇతర క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ఇటీవల మను భాకర్-వైభవ్ సూర్యవంశీ వివాదం ఈ అసమానతను మరింత స్పష్టంగా చూపించింది.

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవంలో భారత స్టార్ షూటర్ మను బాకర్‌ తాజాగా పాల్గొంది. ఈ సందర్భంగా భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో అదరగొడుతున్నాడు, వైభవ్ సాధిస్తోన్న విజయాల గురించి మీరేమనుకుంటున్నారు? అని మీడియా ప్రశ్నించింది. ఇందుకు మను ఎంతో సంయమనంతో సమాధానం ఇచ్చింది. 'మన మెంటార్‌షిప్‌, చుట్టూ ఉన్న సహవాసం బాగుంటేవయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే. టాలెంట్‌కు వయసుతో అస్సలు పని లేదు. కొందరు 60 ఏళ్ల వయసులోనూ అద్భుతాలు చేస్తుంటారు. ఆరేళ్ల వయసులోనూ అబ్బుర పర్చుతుంటారు. వైభవ్ చుట్టూ ఉన్నవారు సరైన వారు. మంచి మార్గదర్శకత్వం ఇస్తున్నారు. భవిష్యత్తులో పెద్ద స్టార్‌ అవుతాడు' అని మను బదులిచ్చింది.

ఒలింపిక్ పతక విజేత అయిన మను భాకర్‌ను టీనేజ్ క్రికెటర్ గురించి ప్రశ్నించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక షూటింగ్ స్టార్‌ను ఎందుకు క్రికెట్ గురించి అడగాలి?, క్రికెట్ చర్చను తీసుకురావడం అన్యాయం అంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. క్రీడ ఏదైనా సరే.. చివరికి క్రికెట్ గురించే ప్రశ్నలు అడగడం ఇతర క్రీడాకారుల విజయాలను తక్కువ చేయడమేనని వారు భావిస్తున్నారు. క్రికెటర్లను ఎప్పుడూ ఇతర క్రీడల గురించి లేదా యువ షూటర్ల గురించి మీడియా ప్రశ్నించదు, కానీ ఇతర క్రీడాకారులు మాత్రం ఎప్పుడూ క్రికెట్ గురించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. 'మను బాకర్ దేశం గర్వించదగ్గ షూటర్. ఆమె సాధించిన పారిస్ ఒలింపిక్స్ రికార్డుల గురించి కాకుండా, సంబంధం లేని క్రికెట్ టాపిక్ తీసుకురావడం మను విజయాలను అవమానించడమే' అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇతర క్రీడాకారుల గురించి క్రికెటర్లను చాలా అరుదుగా మాత్రమే అడుగుతుంటారని, యువ షూటర్ మను బాకర్ గురించి ఏ స్టార్ ఆటగాడినైనా ఎప్పుడైనా అడిగారా? అంటూ క్రీడా లవర్స్ ప్రశ్నించారు. 'మను 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించింది. అప్పట్లో విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వంటి క్రికెటర్లను ఆమె గురించి అభిప్రాయం అడిగారా?, అసలు అడగలేదు. ఇప్పుడు ఎందుకు ఒక ఒలింపిక్ స్టార్‌ను క్రికెట్ గురించి ప్రశ్నిస్తున్నారు?. ఇదే అసమానతకు నిదర్శనం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన భారత క్రీడా సంస్కృతిలో ఉన్న లోపాలను బయటపెట్టింది. ఈ ధోరణి మారకపోతే భారత్ నిజమైన మల్టీ-స్పోర్ట్ నేషన్‌గా మారడం కష్టమంటున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story