Fire Accident : తగలబడ్డాయా? తగలబెట్టారా? కామారెడ్డి పాత బస్టాండ్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident : కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 12 దుకాణాలు దగ్ధం కాగా, రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కుట్ర కోణంపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Fire Accident
Fire Accident : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వరుసగా ఉన్న దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో వ్యాపారులు కోలుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ మూలమలుపు వద్ద ఆదివారం తెల్లవారుజామున మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ సమయంలో దుకాణాలన్నీ మూసి ఉండటం, పరిసర ప్రాంతాల్లో జనం తక్కువగా ఉండటంతో మంటలను ఎవరూ వెంటనే గుర్తించలేకపోయారు. గాలి తోడవ్వడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు పక్కపక్కనే ఉన్న షాపులన్నింటికీ వ్యాపించాయి. స్థానికులు గమనించి కేకలు వేయడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
రూ. 50 లక్షల ఆస్తి బుగ్గిపాలు
ఈ ప్రమాదంలో చిన్న వ్యాపారులకు చెందిన సుమారు 12 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అందులో ఉన్న కిరాణా, ఫ్యాన్సీ, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. తమ కళ్లముందే షాపులు తగలబడుతుంటే బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక వాహనం వచ్చే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుట్ర కోణంపై అనుమానాలు
ఈ ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఇప్పుడు స్థానికంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా కావాలనే పాత కక్షలతో దుకాణాలకు నిప్పు పెట్టారా? అనే అనుమానాలు బాధితులు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా 12 షాపులు అంత త్వరగా తగలబడటం వెనుక ఏదైనా కుట్ర ఉండి ఉండవచ్చని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పోలీసులు.. విచారణ ప్రారంభం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. సమీపంలోని సిసి టీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కాలిపోయిన దుకాణాల యజమానులు వేడుకుంటున్నారు.




