Mayank Yadav: మయాంక్ యాదవ్ నయా చరిత్ర.. అరుదైన జాబితాలో రెండోసారి చోటు!

Mayank Yadav Creates History with First-Ball Wicket. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన భారత బౌలర్ల జాబితాలో మయాంక్ యాదవ్ చోటు సంపాదించాడు.

Rishvik
Published on: 23 July 2026 5:46 PM IST
Mayank Yadav
X

Mayank Yadav: మయాంక్ యాదవ్ నయా చరిత్ర.. అరుదైన జాబితాలో రెండోసారి చోటు!

Mayank Yadav: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ టీమిండియాకు అద్భుత ఆరంభం ఇచ్చాడు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు తొలి ఓవర్‌లోనే బ్రేక్‌ త్రూ అందించాడు. మ్యాచ్ తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్‌ బెనెట్‌ను పెవిలియన్‌కు పంపాడు. బెనెట్‌ బ్యాట్ ఎడ్జ్ అవ్వగా వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో జింబాబ్వే ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది.

ఈ వికెట్‌తో మయాంక్ యాదవ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన భారత బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. మయాంక్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం ఇది రెండోసారి. అంతకుముందు 2024లో హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే పర్వేజ్ హొస్సేన్ ఇమోన్‌ను ఔట్ చేశాడు. ఇప్పుడు జింబాబ్వేపై కూడా ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. అత్యధికసార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన భారత బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ అగ్ర స్థానంలో ఉన్నాడు. భువీ ఈ ఘనతను మూడు సార్లు అందుకున్నాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (రెండు సార్లు), అర్ష్‌దీప్ సింగ్ (రెండు సార్లు), మయాంక్ యాదవ్ (రెండు సార్లు), రవిచంద్రన్ అశ్విన్ (ఒకసారి) ఉన్నారు.

అంతేకాదు భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన అరుదైన జాబితాలో కూడా మయాంక్ యాదవ్ ఉన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బ్యాటర్ షయాన్ జహంగీర్‌ను అర్ష్‌దీప్ సింగ్ తొలి బంతికే ఔట్ చేయగా.. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సయీమ్ అయూబ్‌ను హార్దిక్ పాండ్యా తొలి బంతికే పెవిలియన్‌కు పంపాడు. ఇప్పుడు 2026లో హరారేలో బ్రయాన్‌ బెనెట్‌ను ఔట్ చేసి మయాంక్ యాదవ్ ఆ జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. గాయాల కారణంగా చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన మయాంక్.. జింబాబ్వే సిరీస్‌తో తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే తన మార్క్ చూపిస్తూ.. టీమిండియాకు అద్భుత ఆరంభం ఇచ్చాడు.

10 ఓవర్లు పూర్తయ్యేసరికి జింబాబ్వే స్కోరు 46/4గా ఉంది. వెస్లీ మద్వీర (5), ర్యాన్ బర్ల్ (12) క్రీజులో ఉన్నారు. రవి బిష్ణోయ్ వేసిన 10 ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. అశోక్ శర్మ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మూడు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. శివమ్ దూబె వేసిన ఎనిమిదో ఓవర్‌లో రెండో బంతికి సికిందర్ రజా (4) ఔట్ అయ్యాడు. అంతకుముందు పవర్ ప్లే ముగిసేసరికి జింబాబ్వే మూడు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.

టీ20 ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్లు తీసిన భారత బౌలర్లు:

భువనేశ్వర్ కుమార్ (మూడుసార్లు)

హార్దిక్ పాండ్యా (రెండుసార్లు)

అర్ష్‌దీప్ సింగ్ (రెండుసార్లు)

మయాంక్ యాదవ్ (రెండుసార్లు)

రవిచంద్రన్ అశ్విన్ (ఒక్కసారి)

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story