IPL 2026 : మాస్ కంబ్యాక్ అంటే ఇదే.. గుజరాత్‎ను చిత్తు చేసిన ముంబై

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. తిలక్ వర్మ సెంచరీ, అశ్విని కుమార్ 4 వికెట్లతో గుజరాత్ టైటాన్స్ పై 99 పరుగుల తేడాతో ముంబై గెలిచింది.

CR Reddy
Published on: 21 April 2026 6:30 AM IST
Mumbai Indians
X

 Mumbai Indians

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. వరుసగా నాలుగు ఓటములతో కుంగిపోయిన ఐదుసార్లు ఛాంపియన్ ముంబై, గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ, బుమ్రా అద్భుతమైన స్పెల్, కొత్త కుర్రాడు అశ్విని కుమార్ సంచలన బౌలింగ్‌తో గుజరాత్ జట్టును వారి సొంత గడ్డపైనే చిత్తు చేసింది. 99 పరుగుల భారీ తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో తన ఖాతాను పెంచుకుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. కగిసో రబాడా తన వేగంతో ముంబై టాప్ ఆర్డర్‌ను కకావికలం చేసి కేవలం 44 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో నమన్ ధీర్ (45) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా, తిలక్ వర్మ అసలైన ఆటను చూపించాడు. మొదట నెమ్మదిగా ఆడి 22 బంతుల్లో 19 పరుగులే చేసిన తిలక్, ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చాడు. గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 45 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీ (101 పరుగులు, 7 సిక్సర్లు, 8 ఫోర్లు) పూర్తి చేశాడు. దీంతో ముంబై 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు జస్ప్రీత్ బుమ్రా ఊహించని షాక్ ఇచ్చాడు. గత 6 మ్యాచ్‌లుగా ఒక్క వికెట్ కూడా తీయలేక ఇబ్బంది పడుతున్న బుమ్రా, ఇన్నింగ్స్ తొలి బంతికే సాయి సుదర్శన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి వికెట్ల కరువును తీర్చుకున్నాడు. ఆ వెంటనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా జోస్ బట్లర్‌ను అవుట్ చేయడంతో గుజరాత్ కోలుకోలేకపోయింది. అహ్మదాబాద్ పిచ్‌పై ముంబై బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో టైటాన్స్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్‎గా ఎంట్రీ ఇచ్చిన యువ పేసర్ అశ్విని కుమార్ అసలైన మ్యాజిక్ చేశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. అక్కడితో ఆగకుండా తన లెఫ్ట్ ఆర్మ్ పేస్‌తో రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్ వంటి కీలక వికెట్లను పడగొట్టి 4 వికెట్లతో (4/24) గుజరాత్ నడ్డి విరిచాడు. అశ్విని కుమార్ వేగానికి గుజరాత్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది.

మధ్యలో మిచెల్ సాంట్నర్ ఒకే ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ వికెట్లు తీసి గుజరాత్ ఆశలను పూర్తిగా ఆవిరి చేశాడు. చివర్లో స్పిన్నర్ అల్లా గజన్ఫర్ మిగతా రెండు వికెట్లు తీయడంతో గుజరాత్ టైటాన్స్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై 99 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. వరుస ఓటముల తర్వాత ముంబైకి దక్కిన ఈ విజయం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అటు తిలక్ బ్యాటింగ్, ఇటు అశ్విని బౌలింగ్ ముంబై ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ ఇచ్చాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story