MI vs PBKS: క్వింటన్ డికాక్ మెరుపు సెంచరీ, ముంబై భారీ స్కోర్.. పంజాబ్ కింగ్స్ ముందు టఫ్ టార్గెట్!
Mumbai Indians post 193/6 against Punjab Kings. ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
MI vs PBKS: క్వింటన్ డికాక్ మెరుపు సెంచరీ, ముంబై భారీ స్కోర్.. పంజాబ్ కింగ్స్ ముందు టఫ్ టార్గెట్!
MI vs PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ), పంజాబ్ కింగ్స్ (పీకేబీఎస్) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. ఎంఐ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముంబై ఇన్నింగ్స్‌లో స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు శతకంతో చెలరేగాడు. 60 బంతుల్లో 112 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. డికాక్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు యువ బ్యాటర్ నమన్ ధీర్ హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (2), స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (0) త్వరగా అవుట్ అయ్యారు. ఈ ఇద్దరినీ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. 12 పరుగులకే రెండు వికెట్స్ కోల్పోయిన సమయంలో డికాక్, నమన్ ధీర్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ అనంతరం నమన్ ధీర్ ఔట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (14), షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. డికాక్ మాత్రం క్రీజులో నిలబడి 53 బంతుల్లో సెంచరీ బాదాడు. ఇన్నింగ్స్ చివర్లో తిలక్ వర్మ 3 బంతుల్లో 8 పరుగులు చేశాడు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచులలో ఎక్కువగా అదనపు రన్స్ ఇచ్చిన అర్ష్‌దీప్.. ముంబైపై బాగా బౌలింగ్ చేశాడు. మార్కో యాన్సెన్ ఒక వికెట్ తీసుకోగా.. శశాంక్ సింగ్ ఒక వికెట్ సాధించాడు. యుజ్వేంద్ర చహల్ భారీగా రన్స్ ఇచ్చాడు. 3 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ముంబై భారీ స్కోరుకు కారణం అయ్యాడు. డికాక్ సెంచరీతో ముంబై భారీ స్కోర్ సాధించింది. ముంబైలో టాప్ బౌలర్లు ఉండడంతో ఈ లక్ష్యాన్ని ఛేదించడం పంజాబ్ కింగ్స్‌కు సవాల్ అనే చెప్పాలి.




