Mirabai Chanu : మీరాబాయి చాను కల నెరవేరింది.. చాను పట్టుదలకు సిల్వర్ సలాం.!
మీరాబాయి చాను మెడల్స్ కలెక్షన్లో ఒక్క పతకం మాత్రమే లోటుగా ఉండేది. ఏళ్లుగా ఆ లోటు ఆమె కెరీర్లో పూర్తికాని అధ్యాయంలా మిగిలిపోయింది. ఒలింపిక్స్‌లో రజతం..
meerabai chanu
మీరాబాయి చాను మెడల్స్ కలెక్షన్లో ఒక్క పతకం మాత్రమే లోటుగా ఉండేది. ఏళ్లుగా ఆ లోటు ఆమె కెరీర్లో పూర్తికాని అధ్యాయంలా మిగిలిపోయింది. ఒలింపిక్స్‌లో రజతం, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లో పలు గోల్డ్ మెడల్స్ సాధించినా.. ఏషియన్ గేమ్స్‌లో మాత్రం పతకం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది.
నాగోయాలో రజత పతకం
2026 ఏషియన్ గేమ్స్‌లో మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించారు. బుధవారం జరిగిన పోటీలో మొత్తం 198 కేజీల బరువును ఎత్తిన చాను.. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ రజతంతో మీరాబాయి చాను తన కెరీర్‌లోని ప్రధాన అంతర్జాతీయ పతకాలన్నింటినీ పూర్తి చేసుకున్నారు. అంతేకాదు, 1998లో బ్యాంకాక్ ఏషియన్ గేమ్స్‌లో కర్ణం మల్లేశ్వరి రజతం సాధించిన తర్వాత.. ఏషియన్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చాను నిలిచారు.
ఎన్నో ఎదురుదెబ్బలు.. అయినా వెనక్కి తగ్గలేదు
మీరాబాయి చాను కెరీర్లో విజయాలతో పాటు ఎన్నో కఠినమైన దశలు కూడా ఉన్నాయి. ఆమె కథలో ఎప్పుడూ కనిపించే ఒకే ఒక్క విషయం మాత్రం పట్టుదల. ఓటములు, గాయాలు, నిరాశలు ఎదురైనా ప్రతిసారీ మరింత బలంగా తిరిగి రావడం ఆమె ప్రత్యేకతగా మారింది. రియో ఒలింపిక్స్ ఆమెకు గొప్ప వేదిక కావాల్సి ఉంది. కానీ అక్కడ ఒక్క లిఫ్ట్‌ను కూడా విజయవంతంగా నమోదు చేయలేకపోయారు. ఐదేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో ఆ నిరాశకు సమాధానం ఇచ్చిన చాను.. రజత పతకాన్ని సాధించారు.
హాంగ్జౌలో మిస్ అయిన పతకం
2023 హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లో తనకు ఎప్పటినుంచో అందని ఏషియన్ గేమ్స్ పతకాన్ని సాధిస్తానని చాను భావించారు. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. నాలుగో స్థానంలో నిలిచి పోడియం స్థానాన్ని తృటిలో చేజార్చుకున్నారు. అయితే ఆ ఓటమితో ఆమె ప్రయాణం ఆగలేదు. మూడేళ్ల తర్వాత మళ్లీ జపాన్‌కు చేరుకున్న చాను.. ఈసారి హాంగ్జౌలో మిస్ అయిన పతకాన్ని నాగోయాలో అందుకున్నారు. రజత పతకంతో తన మెడల్స్ కలెక్షన్‌ను పూర్తి చేసుకున్నారు.
ప్రతి ఓటమి తర్వాత కొత్త అధ్యాయం
మీరాబాయి చాను కెరీర్‌ను చూస్తే.. ఆమె కథ ముగిసిందనిపించిన ప్రతిసారీ కొత్త అధ్యాయం మొదలైంది. రియోలో నిరాశ, టోక్యోలో రజతం.. హాంగ్జౌలో నాలుగో స్థానం, నాగోయాలో మళ్లీ రజతం. ప్రతి ఎదురుదెబ్బ తర్వాత తిరిగి బరిలోకి వచ్చి తన సత్తా చాటడం ఆమె కెరీర్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
ఉత్తర కొరియా లిఫ్టర్‌కు స్వర్ణం
నాగోయా పోటీలో ఉత్తర కొరియాకు చెందిన రి సాంగ్-గమ్ స్వర్ణ పతకం సాధించారు. ఆమె మొత్తం 200 కేజీలకు పైగా బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసి ఏషియన్ గేమ్స్‌లో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. ఇండోనేషియాకు చెందిన విజయానా లులుక్ దియాని త్రి 191 కేజీల మొత్తం లిఫ్ట్‌తో కాంస్య పతకం సాధించారు.
32 ఏళ్ల మీరాబాయి చాను ఈ పోటీలో పాల్గొన్న ఏడుగురు వెయిట్లిఫ్టర్లలో అత్యంత వయసున్న క్రీడాకారిణి. అయినప్పటికీ తన అనుభవాన్ని, పట్టుదలను మరోసారి చూపిస్తూ రజత పతకాన్ని సాధించారు. ఏళ్లుగా వెంటాడిన ఏషియన్ గేమ్స్ మెడల్ లోటును నాగోయాలో తీర్చుకున్న మీరాబాయి చాను.. భారత వెయిట్‌లిఫ్టింగ్ చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయాన్ని రాశారు.




