Mithun Manhas-BCCI: చిక్కుల్లో బీసీసీఐ బాస్.. సెప్టెంబరు 3 డెడ్ లైన్!

Mithun Manhas faces a Probe. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్, మాజీ భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మిథున్ మన్హాస్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు.

Rishvik
Published on: 20 Aug 2026 7:34 PM IST
Mithun Manhas-BCCI
X

Mithun Manhas-BCCI: చిక్కుల్లో బీసీసీఐ బాస్.. సెప్టెంబరు 3 డెడ్ లైన్!

Mithun Manhas-BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ మిథున్ మన్హాస్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సతీమణి ఆర్తి అహ్లావత్‌, మన్హాస్‌ డేటింగ్ చేసినట్లు ఏడాది క్రితం సోషల్ మీడియా కోడై కూసింది. జూనియర్‌ స్థాయి క్రికెట్ సెలక్షన్‌లో ఎంపికయ్యేందుకు ఏకంగా పుట్టిన తేదీ (డేట్ ఆఫ్ బర్త్‌)ని మార్చినట్లు ఇప్పుడు మిథున్‌పై ఆరోపణలు వచ్చాయి.ఈ వ్యవహరంపై ప్రాథమిక విచారణ జరిపి.. సెప్టెంబరు 3వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని జమ్మూలోని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. జమ్మూలోని సబ్‌-జడ్జి, స్పెషల్ రైల్వే మేజిస్ట్రేట్ సందీప్ సింగ్ సేన్ ఆదేశాలు జారీ చేశారు.

మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ జాయింట్ ఆనరరీ సెక్రటరీ సుదర్శన్ మెహతా దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. మిథున్ మన్హాస్ పుట్టిన తేదీకి సంబంధించిన రికార్డుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. మోసం, చీటింగ్, ఫోర్జరీ వంటి నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించకుండా.. ముందుగా ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని మేజిస్ట్రేట్ సూచించారు. ఫిర్యాదుతో పాటు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం BNSS నిబంధనల ప్రకారం.. కాగ్నిజబుల్ నేరం నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ అవసరమని కోర్టు పేర్కొంది.

ఫిర్యాదులో ప్రధానంగా మిథున్ మన్హాస్ రెండు వేర్వేరు పుట్టిన తేదీలను సమర్పించారని ఆరోపణలు ఉన్నాయి. జాతీయ స్థాయి సబ్‌-జూనియర్, జూనియర్ క్రికెట్ పోటీల్లో ఆడేందుకు అర్హత పొందే ఉద్దేశంతో పుట్టిన తేదీని మార్చి చూపించారని సుదర్శన్ మెహతా ఆరోపించారు. పాఠశాల రికార్డుల్లో ఉన్న తేదీకి, క్రికెట్ సంస్థ రికార్డుల్లో ఉన్న తేదీకి తేడా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. జమ్మూలోని మహారాజా హరి సింగ్ అగ్రికల్చర్ కాలేజియేట్ స్కూల్లో మన్హాస్ పుట్టిన తేదీ 1977 డిసెంబర్ 9గా నమోదై ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆయన పుట్టిన తేదీ 1979 అక్టోబర్ 12గా ఉన్నట్లు ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ రెండు తేదీల మధ్య దాదాపు రెండేళ్ల వ్యత్యాసం ఉండటమే ప్రస్తుతం వివాదానికి ప్రధాన కారణంగా మారింది. MHAC నాగ్‌బానీ ఇచ్చిన సమాచారంలో.. మిథున్ మన్హాస్ మొదట జమ్మూలోని ప్రెజెంటేషన్ కాన్వెంట్ గాంధీనగర్‌లో చదివారని, అనంతరం 1988 జూలై 27న ఆరో తరగతిలో ఉండగా MHAC స్కూల్‌లో చేరారని ఫిర్యాదులో ఉంది. ఆయన అడ్మిషన్ నంబర్ 2236గా, పుట్టిన తేదీ 09.12.1977గా పాఠశాల రికార్డుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

పుట్టిన తేదీకి సంబంధించిన రికార్డులను తప్పుగా చూపించి.. తప్పుడు సమాచారం అందించడంతో పాటు పత్రాలను మార్చారని సుదర్శన్ మెహతా ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లను, వాటికి అనుగుణంగా భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.

అయితే ఇవన్నీ ప్రస్తుతం ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు మాత్రమే. పోలీసుల విచారణ అనంతరం సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిథున్ మన్హాస్ గత ఏడాది సెప్టెంబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జమ్మూకశ్మీర్ నుంచి బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచారు. మాజీ భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అయిన మన్హాస్.. తన క్రికెట్ కెరీర్‌లో జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించారు.

భారత జట్టు తరఫున ఎప్పుడూ మన్హాస్ ఆడలేదు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ సంఘంలో పాలకుడిగా పనిచేశారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో మన్హాస్ పుట్టిన తేదీకి సంబంధించిన వివాదంపై పోలీసుల ప్రాథమిక విచారణ కీలకంగా మారింది. సెప్టెంబర్ 3లోపు సమర్పించాల్సిన పోలీసుల నివేదికలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story