Shubman Gill: శుభ్‌మన్ గిల్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్!
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టుకు దూరంగా ఉంచడంపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్!
Shubman Gill: టీమిండియా స్టార్ బ్యాటర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టుకు దూరంగా ఉంచడంపై మాజీ భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు, టెస్టుల్లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న గిల్‌ను టీ20 ఫార్మాట్‌లో ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదన్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, ఆకిబ్ నబీ వంటి ఆటగాళ్లకు టెస్ట్ జట్టులో అవకాశం ఇవ్వకపోవడాన్ని కూడా అజారుద్దీన్ ప్రశ్నించాడు.
ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై శుభ్‌మన్ గిల్ 104 పరుగులు చేశాడు. ఆపై అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో గిల్ (126) సెంచరీ బాదాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ (154) ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్.. కెప్టెన్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. 'గిల్ కెప్టెన్సీ బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తున్నాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా మరింత మెరుగుపడింది. అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల అత్యుత్తమ ఆటగాడు. అలాంటి ఆటగాడిని టీ20ల నుంచి తప్పించడం ఆశ్చర్యంగా ఉంది' అని పేర్కొన్నాడు.
2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు వరకు భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను అకస్మాత్తుగా జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. 'గిల్‌ను ఏ ఫార్మాట్ నుంచైనా తప్పించాల్సిన అవసరం లేదు. అతను అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఆటగాడు' అని స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా అజారుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఆకిబ్ నబీ అద్భుతమైన రెడ్ బాల్ బౌలర్. స్వింగ్ బౌలింగ్‌లో అతనికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. గత రెండు రంజీ సీజన్లలో వరుసగా వికెట్లు తీసినా టెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరం' అని అన్నాడు.
అలాగే సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో నిరంతరం పరుగులు చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు దక్కడం లేదని అజారుద్దీన్ విమర్శించాడు. 'దేశవాళీ క్రికెట్ ఆడాలని అందరూ చెబుతారు. కానీ అక్కడ రాణించినా అవకాశాలు రాకపోతే ఆ ప్రదర్శనల ప్రయోజనం ఏమిటి?' అని ప్రశ్నించాడు. 'టెస్ట్ క్రికెట్‌కు ప్రత్యామ్నాయం లేదు. పరిస్థితులు, పిచ్‌లు, సవాళ్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అందుకే దానిని నిజమైన పరీక్షగా పరిగణిస్తారు. భారత్ మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి' అని టెస్ట్ మ్యాచ్‌ల ప్రాధాన్యతపై అభిప్రాయపడ్డాడు.
టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్పై కూడా అజారుద్దీన్ ప్రశంసలు కురిపించాడు' "అతనికి క్రికెట్‌పై మంచి అవగాహన ఉంది. సమయం గడిచే కొద్దీ మరింత మంచి నాయకుడిగా ఎదుగుతాడు' అని పేర్కొన్నాడు. అయితే మాజీ కెప్టెన్ సూర్యను టీ20 కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించే నిర్ణయాన్ని మాత్రం సమర్థించాడు. 'క్రికెట్‌లో గత ప్రదర్శనల కంటే ప్రస్తుత ఫామ్ ముఖ్యం.
ప్రతి సారి మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిందే. యువ ఆటగాళ్లు వేగంగా వస్తున్న ఈ కాలంలో నిరంతర ప్రదర్శన చాలా అవసరం' అని వివరించాడు. రో-కోల రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని చెప్పాడు. 'ఒక ఆటగాడికి తన శారీరక, మానసిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు. దేశానికి అపార సేవలు చేసిన రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలి' అని అజారుద్దీన్ పేర్కొన్నాడు.




