Mohammed Shami: ఆ బాధ నా మనసులో నుంచి పోవడం లేదు.. షమీ భావోద్వేగ వ్యాఖ్యలు!
Mohammed Shami: Mohammed Shami heartbreak of India's 2023 ODI World Cup final defeat. ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం తన మనసులో ఇప్పటికీ చెరగని బాధగా మిగిలిపోయిందని షమీ తెలిపాడు.
Mohammed Shami: ఆ బాధ నా మనసులో నుంచి పోవడం లేదు.. షమీ భావోద్వేగ వ్యాఖ్యలు!
Mohammed Shami: 2023 వన్డే ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. షమీకి టీమిండియా ఎంట్రీ ఛాన్సెస్ రోజురోజుకూ తగ్గుతున్నాయి. షమీ చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడగా.. టెస్టు మ్యాచ్‌ను 2023లో ఆడాడు. ఇక 2025లో ఇంగ్లండ్‌పై చివరగా టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షమీ.. 2023 వన్డే ప్రపంచ కప్ రోజులను గుర్తుచేసుకుని బావోద్వేగంకు గురయ్యాడు.
వన్డే ప్రపంచ కప్ 2023లో కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే మహ్మద్ షమీ 24 వికెట్లు తీశాడు. దాంతో ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం తన మనసులో ఇప్పటికీ చెరగని బాధగా మిగిలిపోయిందని తెలిపాడు. 'ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి ఇప్పటికీ నా కళ్లముందే కనిపిస్తుంది. మేం ట్రోఫీ గెలవాల్సింది అనేదే నా మనసులో ఉన్న ఏకైక బాధ. వ్యక్తిగత రికార్డులకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. అయితే ప్రపంచ కప్ గణాంకాలు లేదా నేను తీసిన వికెట్ల జాబితా కనిపించినప్పుడు.. గాయాల కారణంగా నేను మిస్ అయిన మ్యాచ్‌లు గుర్తుకొస్తాయి. ప్రతి ఐసీసీ టోర్నీలో 3-5 మ్యాచ్‌లు మిస్ కాకపోయి ఉంటే.. వికెట్ల జాబితాలో నేను అగ్రస్థానంలో ఉండేవాడినేమో అనిపిస్తుంది' అని షమీ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.
అదే ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో పనిచేసిన కోచ్‌ల గురించి మహ్మద్ షమీ స్పందించాడు. తనకు అత్యంత ఇష్టమైన కోచ్ రవిశాస్త్రి అని చెప్పాడు. 'అందరినీ పోల్చడం కాస్త కష్టమే. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో ఎక్కువ కాలం ఆడలేదు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలతో మంచి సమయం గడిపాను. రవిశాస్త్రితో మంచి అనుబంధం ఉంది. అయితే ఈ నలుగురిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం రవిశాస్త్రినే ఎంచుకుంటాను. ఆయన ఆటగాళ్లకు ఇచ్చే స్వేచ్ఛ, మైదానంలో దూకుడుగా ఆడేలా కల్పించే వాతావరణం నాకు ఎంతో నచ్చింది. అతడి సారథ్యంలో ప్లేయర్స్ బాగా ఆడారు, జట్టు కూడా అద్భుత విజయాలు అందుకుంది. రవి భాయ్‌నే నా ఫేవరెట్ కోచ్' అని పేర్కొన్నాడు.
టీమిండియాలోకి తిరిగి రావాలనే లక్ష్యంతో మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్‌లో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం యువ బౌలర్లకు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో అతని పునరాగమనం పెను సవాల్‌గా మారింది. అయినప్పటికీ తన అనుభవం, పట్టుదలతో మరోసారి భారత జట్టులో చోటు సంపాదించాలని షమీ ఆశాభావంతో ఉన్నాడు. అయితే బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం షమీకి టీమిండియా ఎంట్రీ అంత ఈజీ కాదని చెప్పాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ షమీకి లేదని స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్ కారణంగానే షమీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు.




