Mohammed Shami: అప్పటివరకూ వదిలేది లేదు.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన షమీ!

Mohammed Shami: ప్రస్తుతం ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ.. తాజాగా తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. బోర్ కొట్టే వరకు ఆటను వదిలేది లేదని స్పష్టం చేశాడు.

Rishvik
Published on: 31 March 2026 9:07 PM IST
Mohammed Shami Retirement Statement: India Comeback Uncertain, Shami Says “Not Quitting Anytime Soon”
X

Mohammed Shami

Mohammed Shami: వెటరన్ క్రికెటర్ మహ్మద్ షమీ చివరిసారిగా 2025 మార్చి 9న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత జట్టు తరఫున ఆడాడు. అప్పటి నుంచి షమీకి జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కలేదు. ఫిట్‌గా ఉన్నప్పటికీ సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశవాళీల్లో రాణిస్తున్నా.. టీమిండియాలో చోటు దక్కడం లేదు. టీమిండియాలో షమీ రాకపై క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రమే స్పష్టత ఇవ్వగలరని పలువురు మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి మహ్మద్ షమీ ఎంపికలో ఉన్నప్పటికీ గాయం పూర్తిగా తగ్గలేదని భావించి అతడే తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కూడా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో షమీ, అజిత్ అగార్కర్ మధ్య చిన్న వివాదం కూడా చెలరేగింది. దేశీయ క్రికెట్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో ఆడుతూ.. 2025-26 సీజన్‌లో మొత్తం 67 వికెట్లు పడగొట్టి తన ఫామ్‌ను నిరూపించాడు. అయినప్పటికీ అతడికి టీమిండియాలో అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత జట్టులో ఇక షమీకి చోటు కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న షమీ.. తాజాగా తన రిటైర్మెంట్‌పై స్పందించాడు. 'నేను అలసిపోయిన రోజు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాను. కానీ ఇప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. అలాంటి ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి. నేను ఇంకా ఆటను ఆస్వాదిస్తున్నా. ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. వికెట్స్ తీస్తున్నా. క్రికెట్‌పై నాకు బోర్ కొట్టాలి. అప్పటివరకూ వదిలేది లేదు' అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇప్పటికే 2023లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న షమీ.. గత సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హైదరాబాద్ తరఫున ఆడుతూ 9 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇప్పుడు లక్నో జట్టులో కొత్త ఆరంభంతో మళ్లీ తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 'నేను బౌలర్‌గా నా వంతు శాతం కృషి చేస్తాను. జట్టు నాపై నమ్మకం ఉంచింది కాబట్టి నా శక్తి మేరకు ప్రదర్శిస్తాను. మిగతా విషయాలు అదృష్టంపై ఆధారపడతాయి' అని షమీ చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story