Mohammed Shami: ఎనీ టైమ్ ఐయామ్ రెడీ.. గంభీర్, బీసీసీఐకి షమీ బిగ్ మెసేజ్!
Mohammed Shami Sends Strong Comeback Message to BCCI. తన అంతర్జాతీయ కెరీర్ అప్పుడే ముగిసిపోలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐకి షమీ సంకేతాలు ఇచ్చాడు.
Mohammed Shami: ఎనీ టైమ్ ఐయామ్ రెడీ.. గంభీర్, బీసీసీఐకి షమీ బిగ్ మెసేజ్!
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుకు ఆడని షమీ.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఇటీవల బీసీసీఐ సెలెక్టర్ల ప్రణాళికల్లో అతడు లేదు. వరుసగా టీమిండియా టోర్నీలు ఆడుతున్నా షమీ మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుంటూ మళ్లీ భారత జట్టులోకి రావడమే లక్ష్యంగా కష్టపడుతున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్ అప్పుడే ముగిసిపోలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐకి సంకేతాలు ఇచ్చాడు.
మొహమ్మద్ షమీ ప్రస్తుతం ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నాడు. గత సీజన్‌తో పోలిస్తే ఐదు కిలోల బరువు తగ్గి.. కొత్త సీజన్ కోసం పూర్తి ఉత్సాహంతో ఉన్నాడు. ఈ విషయాన్ని షమీ చిన్ననాటి కోచ్ మహ్మద్ బద్రుద్దీన్ తెలిపాడు. 'మొహమ్మద్ షమీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. దేశానికి అతడి అవసరం వస్తే ఎప్పుడైనా భారత జట్టుకు సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా ఫిట్‌గా మారేందుకు కృషి చేస్తున్నాడు' అని బద్రుద్దీన్ పేర్కొన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో కూడా సత్తా చాటాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 37 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో మరో ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు సాధించాడు. అయినప్పటికీ భారత జట్టులో మాత్రం చోటు దక్కలేదు.
ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భారత పేసర్లు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యువ పేసర్ గుర్నూర్ బ్రార్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో విదేశీ పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన షమీ వంటి బౌలర్ ఉంటే భారత జట్టుకు ఎంతో ఉపయోగపడేదని బద్రుద్దీన్ అభిప్రాయపడ్డాడు. 'ఇంగ్లండ్‌లో పేసర్లకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదు. షమీ ఉంటే జట్టుకు చాలా ఉపయోగపడేవాడు. 2027 వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పరిస్థితుల్లో విజయవంతంగా బౌలింగ్ చేయాలంటే అనుభవం ఎంతో అవసరం. షమీ లాంటి సీనియర్ బౌలర్ జట్టుకు కీలకంగా మారవచ్చు' అని చెప్పాడు.
ఇక ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానేపై మొహమ్మద్ షమీ ప్రశంసలు కురిపించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించిన షమీ.. 'క్లాస్, క్రమశిక్షణ, దేశం పట్ల అంకితభావంతో సాగిన గొప్ప కెరీర్‌కు ముగింపు పలికావు. భారత జెర్సీలో ప్రతి పరుగుకు, ప్రతి పోరాటానికి ధన్యవాదాలు. నీ జీవితంలోని కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు' అంటూ రహానేపై ప్రశంసలు కురిపించాడు. భారత్ తరఫున షమీ 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 450కి పైగా వికెట్స్ పడగొట్టాడు.




