మహ్మద్ షమీని అప్పుడే టీమిండియాకు దూరం చేయోద్దు.. మాజీ కోచ్ భరత్ అరుణ్!

Mohammed Shami Team India comeback: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీకి జాతీయ జట్టులో పునరాగమన అవకాశం ఇంకా ఉండాలని మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డారు.

Venkat
Published on: 7 Sept 2026 1:38 PM IST
Mohammed Shami Team India comeback
X

మహ్మద్ షమీని అప్పుడే టీమిండియాకు దూరం చేయోద్దు.. మాజీ కోచ్ భరత్ అరుణ్!

Mohammed Shami Team India comeback: మహ్మద్ షమీ విషయంలో టీమిండియా తలుపులు ఇప్పుడే మూసేయడం సరికాదని మాజీ భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నారు. ఇంకా అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉందని పేర్కొన్నారు. ఆటగాడు నిలకడగా రాణిస్తున్నప్పుడు వయసును ప్రధాన ప్రమాణంగా చూడకూడదని స్పష్టం చేశారు.

దులీప్ ట్రోఫీలో షమీ జోరు..

ప్రస్తుతం 2026 దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున షమీ బరిలో ఉన్నాడు. ఫైనల్‌కు ముందు సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో అతను ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శన నేపథ్యంలో అతని టీమిండియా కంబ్యాక్‌పై చర్చ మళ్లీ ఊపందుకుంది.

బంతి చేతికొస్తే ఆపడం కష్టమే..

షమీకి బౌలింగ్ అంటే ఎంతో ఇష్టమని అరుణ్ చెప్పారు. నెట్స్ అయినా, మ్యాచ్ అయినా బంతి చేతికొస్తే తన రన్‌అప్ సిద్ధం చేసుకుని బౌలింగ్ మొదలుపెడతాడని వివరించారు. కొన్నిసార్లు బౌలింగ్ చేయనని చెప్పినా.. కొద్దిసేపటికే మళ్లీ బంతి అందుకుంటాడని, పూర్తిగా బౌలింగ్‌పై దృష్టి పెడతాడని పేర్కొన్నారు.

100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల మైలురాయి..

షమీ తన కెరీర్‌లో 100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడటం ప్రత్యేకమైన ఘనత అని భరత్ అరుణ్ పేర్కొన్నారు. రెడ్ బాల్ క్రికెట్ అంటే షమీకి ప్రత్యేక ఇష్టమని, ఇంత సుదీర్ఘంగా కొనసాగడం అతని నిలకడను చూపిస్తుందని అన్నారు.

టీమ్‌ఇండియా తరపున షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. 2023లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అతను.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. దులీప్ ట్రోఫీలో అతని ప్రదర్శన నేపథ్యంలో జాతీయ జట్టులో తిరిగి అవకాశం వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story