Mohammed Shami: టీమిండియా దారులు మూసుకున్నట్టేనా?.. షమీకి సెలక్టర్ల సందేశం ఇదే!

Mohammed Shami: Mohammed Shami's India Comeback in Doubt. ఫిట్‌నెస్ కారణంగానే టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదని అగార్కర్ తెలిపాడు.

Rishvik
Published on: 4 Aug 2026 6:05 PM IST
Mohammed Shami
X

Mohammed Shami: టీమిండియా దారులు మూసుకున్నట్టేనా?.. షమీకి సెలక్టర్ల సందేశం ఇదే!

Mohammed Shami: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ.. దేశవాళీలో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నాడు. వికెట్స్ మీద వికెట్స్ పడగొడుతున్నా.. బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం కనికరించడం లేదు. షమీ జాతీయ జట్టుకు ఆడి ఎన్నో నెలలు అవుతోంది. తాజాగా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడినా అవకాశం దక్కలేదు. బుమ్రా స్థానంలో సెలెక్టర్లు యువకుడికి ఛాన్స్ ఇచ్చారు. దీనిపై అభిమానులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆడిన జస్ప్రీత్ బుమ్రా.. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే సరైన ఫిట్‌నెస్‌ లేని కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనకు ప్రతిఫలంగా నబీకి ఈ అవకాశం దక్కింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సీనియర్ పేసర్ మహ్మద్ షమీ భవిష్యత్తుపై కూడా స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు భారత బౌలింగ్ దళంలో కీలక పాత్ర పోషించిన షమీకి ప్రస్తుతం జాతీయ జట్టులోకి తిరిగి రావడం అంత సులభం కాదని ఈ ఎంపిక సూచిస్తోంది.

మహ్మద్ షమీ చివరిసారిగా 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు క్రికెట్‌లో అయితే 2023 తర్వాత అతనికి అవకాశం రాలేదు. వన్డేల్లో కూడా గత ఏడాది న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచ్ చివరిది. గాయాల కారణంగా కొంతకాలం టీమిండియాకు దూరమైన షమీ.. తిరిగి దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించినప్పటికీ భారత జట్టులో చోటు మాత్రం దక్కలేదు. ఇటీవల షమీ పునరాగమనంపై బీసీసీఐ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్‌నెస్ ప్రస్తుతం షమీకి లేదని స్పష్టం చేశాడు. ఫిట్‌నెస్ కారణంగానే షమీని జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం లేదని అగార్కర్ తెలిపాడు.

అయితే మహ్మద్ షమీ ఇటీవలి గణాంకాలు మాత్రం బాగున్నాయి. గత ఏడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో అతడు 1,383 బంతులు వేసి 37 వికెట్లు పడగొట్టాడు. 16.72 సగటుతో బౌలింగ్ చేసిన షమీ.. ఏకంగా 50 మెయిడెన్ ఓవర్లు వేశాడు. అంతేకాదు మూడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కెరీర్ బెస్ట్‌గా 8/90 గణాంకాలను కూడా నమోదు చేశాడు. మరోవైపు ఆకిబ్ నబీ అదే రంజీ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 12.56 సగటుతో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని అద్భుత ప్రదర్శనకే బీసీసీఐ శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది.

ఆకిబ్ నబీ ఎంపికతో మహ్మద్ షమీకి బీసీసీఐ సెలెక్టర్లు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లే. భారత టెస్టు జట్టులోకి తిరిగి రావాలంటే కేవలం అనుభవం సరిపోదని, యువ బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శనతో పాటు పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిందే అని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. ప్రస్తుతం యువ పేసర్లు సీనియర్లతో పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీల్లో షమీ యువకులకు మించి మెరుగైన ఆధిపత్యం చాటితేనే.. మరోసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశాలు బలపడతాయి. పర్ఫామెన్స్ తగ్గితే మాత్రం ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story