Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీకి చుక్కలు చూపించిన మొహ్సిన్ ఖాన్.. మేడన్ ఓవర్‌తో పాటు వికెట్ కూడా

Vaibhav Sooryavanshi : మొహసిన్ ఖాన్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సరెండర్ అయ్యాడు. మేడన్ ఓవర్‌తో పాటు కీలక వికెట్ తీసి మొహసిన్ అద్భుత రికార్డు సృష్టించాడు.

CR Reddy
Published on: 23 April 2026 6:52 AM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi : రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, చిన్న వయసులోనే రికార్డులు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2026లో ఒక చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్‌తో వైభవ్ ఆట కట్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన వైభవ్.. మొహసిన్ వేసిన నాలుగో ఓవర్‌లో చుక్కలు చూశాడు. ఆ ఓవర్ మొత్తం ఒక్క రన్ కూడా చేయలేకపోవడమే కాకుండా, చివరి బంతికి వికెట్ సమర్పించుకున్నాడు.

సాధారణంగా వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉంటే బౌలర్లు భయపడతారు. కానీ మొహసిన్ ఖాన్ పక్కా ప్లానింగ్‌తో వచ్చి వైభవ్ చేతులు ఎత్తేలా చేశాడు. ఆ ఓవర్లో మొదటి ఐదు బంతులకు ఒక్క రన్ కూడా రాలేదు. ప్రతి బంతిని వైభవ్ ఆడేందుకు ప్రయత్నించినా మొహసిన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఒత్తిడి తట్టుకోలేక ఆఖరి బంతికి భారీ షాట్ కొట్టబోయిన వైభవ్.. గాలిలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దిగ్వేష్ సింగ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.

వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో ఇలా ఒక బౌలర్ చేతిలో మేడన్ ఓవర్‌తో పాటు వికెట్ కూడా కోల్పోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా వైభవ్‌కు ఐదు డాట్ బాల్స్ వేసిన రికార్డు ఉంది కానీ, మేడన్ వికెట్ ఓవర్ మాత్రం మొహసిన్ ఖాతాలోకే చేరింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య చేతిలో భారీగా పరుగులు ఇచ్చుకున్న మొహసిన్, ఈ మ్యాచ్‌లో మాత్రం చాలా పవర్ ఫుల్‌గా కంబ్యాక్ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో మొహసిన్ కేవలం వైభవ్ వికెట్ మాత్రమే కాకుండా, ప్రమాదకరమైన బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ (22) వికెట్ కూడా తీశాడు. లక్నో ఓడిపోయినప్పటికీ మొహసిన్ స్పెల్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మేడన్ ఓవర్లు నమోదైతే, ఆ రెండు రికార్డులు మొహసిన్ ఖాన్ పేరు మీదనే ఉండటం విశేషం. ఏకానా పిచ్ నెమ్మదిగా ఉండటంతో మొహసిన్ వేగంలో వైవిధ్యం చూపిస్తూ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story