MS Dhoni Birthday: ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంఎస్ ధోనీ క్రేజ్.. 'తలా ఫర్ ఏ రీజన్' పోస్ట్ వైరల్!

MS Dhoni's 45th birthday celebrations go global. 'మిస్టర్ కూల్' ధోనీ పుట్టినరోజు వేడుకలు 'ఫిఫా' వరల్డ్‌కప్ 2026కి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Rishvik
Updated on: 7 July 2026 7:01 PM IST
MS Dhoni Birthday
X

MS Dhoni Birthday: ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంఎస్ ధోనీ క్రేజ్.. 'తలా ఫర్ ఏ రీజన్' పోస్ట్ వైరల్!


FIFA World Cup 2026 Celebrates MS Dhoni Birthday: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్‌కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ తన 45వ పుట్టినరోజును నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, మాజీ క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈసారి 'మిస్టర్ కూల్' ధోనీ పుట్టినరోజు వేడుకలు 'ఫిఫా' వరల్డ్‌కప్ 2026కి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

'తలా ఫర్ ఏ రీజన్':

ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ప్రేమగా పిలిచే 'తలా' అనే పేరును ఫిఫా వరల్డ్‌కప్ 2026 అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ప్రస్తావించడం విశేషం. లియోనెల్ మెస్సీ, కిలియన్ ఎంబాప్పే, ఎర్లింగ్ హాలాండ్ తలా ఏడేసి గోల్స్ చేసిన ఫొటోను పంచుకుంటూ.. '7 Goals. Thala For A Reason. Happy Thala Day' అంటూ పోస్టు చేసింది. ధోనీ ధరించిన ఐకానిక్ జెర్సీ నంబర్ 7కు నివాళిగా చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చుసిన మహీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ ఎంఎస్ ధోనీ క్రేజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

బీసీసీఐ, మాజీ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు:

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాజీ సారథి ఎంఎస్ ధోనీతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ధోనీతో దిగిన చిత్రాన్ని షేర్ చేస్తూ.. ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడే ధోనీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లకు ఆదర్శమని కొనియాడాడు. మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ.. 'కొంతమంది మ్యాచ్‌లు గెలిపిస్తారు.. కొంతమంది ట్రోఫీలు గెలిపిస్తారు.. కానీ ధోనీ ఒక యుగాన్నే గెలిచాడు' అంటూ విషెష్ చెప్పాడు.

ప్రత్యేక గ్రాఫిక్ విడుదల:

క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ ఆయన అంతర్జాతీయ కెరీర్‌ను గుర్తు చేస్తూ ప్రత్యేక గ్రాఫిక్ విడుదల చేసింది. ధోనీ తన కెరీర్‌లో 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 17,266 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 829 డిస్మిసల్స్ నమోదు చేశాడు. కెప్టెన్‌గా భారత్‌కు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించి చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా ధోనీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

సీఎస్‌కే ప్రత్యేక వీడియో:

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రత్యేక వీడియో విడుదల చేస్తూ.. 'ఒక హీరోగా మొదలై.. తరతరాలకు జీవన విధానంగా మారిన లెజెండ్' అంటూ పేర్కొంది. ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతూ అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలిపించిన కెప్టెన్‌గా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి:

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీ.. తన 15 ఏళ్ల కెరీర్‌లో భారత క్రికెట్‌ను ప్రపంచ శిఖరానికి చేర్చాడు. ప్రశాంతమైన నాయకత్వం, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి విజయాన్ని అందించే ఫినిషింగ్ సామర్థ్యం, ఒత్తిడిలోనూ స్థిరమైన నిర్ణయాలతో కోట్లాది అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచాడు. 45వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సోషల్ మీడియాలో "హ్యాపీ తలా డే" అంటూ తమ అభిమాన క్రికెట్ దిగ్గజానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story