MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే కోచ్ క్లారిటీ!

MS Dhoni: సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 19 May 2026 5:55 PM IST
MS Dhoni
X

MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. సీఎస్‌కే కోచ్ క్లారిటీ!

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ ఛాన్సెస్ సంక్లిష్టం అయ్యాయి. ఈ మ్యాచ్ చెపాక్ వేదికగా జరగగా.. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడుతాడని అందరూ అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. మహీ మైదానంలోకి దిగలేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ధోనీ భవిష్యత్తుపైనే నిలిచింది. వచ్చే సీజన్‌లో ధోనీ మళ్లీ పసుపు జెర్సీతో బరిలోకి దిగుతాడా? అనే ప్రశ్న అభిమానుల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ధోనీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వచ్చే సీజన్‌లో ఆడాలా వద్దా అన్నది పూర్తిగా జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కే ఎంఎస్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం, జట్టులో కొత్త తరం ఆటగాళ్లను తయారుచేయడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని భావించారు. అయితే గాయాల కారణంగా ధోనీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బ్యాట్ పట్టకపోవడమే కాకుండా.. వికెట్ కీపింగ్ గ్లౌవ్స్ కూడా ధరించలేదు. అయినప్పటికీ జట్టుతో పాటు ఉంటూ యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా వ్యవహరించాడని స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన స్టీఫెన్ ఫ్లెమింగ్.. ‘ఎంఎస్ ధోనీ భవిష్యత్తు గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ సీజన్‌లో అతడు ఎక్కువ సమయం జట్టుతో గడిపాడు. యువ ఆటగాళ్లకు అతడి సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. ధోనీ మ్యాచ్‌లు ఆడకపోయినా జట్టుపై అతడి ప్రభావం చాలా ఉంది. ఈ సీజన్‌లో మేము కొంతమంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చాం.

భవిష్యత్తులో వారు సీఎస్‌కేకు కీలక ఆటగాళ్లుగా మారతారని ఆశిస్తున్నాం. మేం చాలా ప్రయోగాలు చేశాం. కానీ ఫలితాల ఆధారంగానే మమ్మల్ని అంచనా వేస్తారు. ధోనీ వచ్చే సీజన్‌లో ఆడతాడా లేదా? అన్నది నేను నిర్ణయించలేను. అది మేనేజ్‌మెంట్‌ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ధోనీ కూడా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి’ అని తెలిపాడు.

ఈ సీజన్ మొత్తం ఎంఎస్ ధోనీపై అనేక ఊహాగానాలు వచ్చాయి. గాయాల కారణంగానే ధోనీ ఆడటం లేదని సీఎస్‌కే యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అతడు పక్కన ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు చెపాక్ మైదానంలో ధోనీ ఆడే అవకాశముందన్న వార్తలు రావడంతో అభిమానులు ఉత్సాహానికి లోనయ్యారు.

అయితే చివరికి అతడు మ్యాచ్‌లో లేడు. ఇక మాజీ భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ధోనీ ఇప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ధోనీ వచ్చే సీజన్‌లో ఆడతాడా లేదా అన్న ప్రశ్నకు ఇప్పటికైతే స్పష్టమైన సమాధానం లేదు. కానీ సీఎస్‌కే అభిమానులు మాత్రం తమ అభిమాన కెప్టెన్‌ను మరోసారి మైదానంలో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story