MS Dhoni: నిజమైన నాయకుడు ఎంఎస్ ధోనీ.. బద్దశత్రువు డీకే ప్రశంసల వర్షం!

Dinesh Karthik praise on MS Dhoni's leadership: కెప్టెన్‌గా ధోనీ నిజాయితీ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కార్తీక్ వెల్లడించాడు.

Rishvik
Published on: 10 Jun 2026 10:06 PM IST
MS Dhonis Leadership Wins Praise From Dinesh Karthik A True Leader
X

MS Dhoni: నిజమైన నాయకుడు ఎంఎస్ ధోనీ.. బద్దశత్రువు డీకే ప్రశంసల వర్షం!

Dinesh Karthik praise on MS Dhoni's leadership: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు ఎంఎస్ ధోనీ. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. తన కూల్ కెప్టెన్సీతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. అయితే ధోనీ జట్టులోకి రావడంతో చాలా మంది కీపింగ్ ఆశలు వదులుకున్నారు. అందులో ఒకరు మాజీ ప్లేయర్ దినేష్ కార్తీక్. మహీ వళ్ళ తనకు అవకాశాలు రాకపోయినా.. అతడి కెప్టెన్సీని ప్రశంసించాడు. కెప్టెన్‌గా ధోనీ నిజాయితీ, పారదర్శకత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తాజాగా కార్తీక్ వెల్లడించాడు.

తాను భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోల్పోయిన ఒక సందర్భాన్ని దినేష్ కార్తీక్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ధోనీ వ్యవహరించిన తీరు తనకు ఇప్పటికీ గుర్తుందని తెలిపాడు. జట్టులో ఆడే అవకాశం లేకపోయినా.. ఆ విషయాన్ని దాటవేయకుండా ధోనీ స్వయంగా తన దగ్గరకు వచ్చి అసలు కారణాలను వివరించాడని చెప్పాడు. 'ఒకసారి నన్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు. అలాంటి వార్త ఏ ఆటగాడికైనా బాధ కలిగిస్తుంది. కానీ ధోనీ ఆ విషయాన్ని చాలా గౌరవప్రదంగా, స్పష్టంగా వివరించాడు. జట్టు వేరే కాంబినేషన్‌ను పరిశీలిస్తోందని, అందుకే నేను ఆ మ్యాచ్‌లో ఆడటం లేదని నేరుగా చెప్పాడు. నిర్ణయం కంటే.. మ్హి చెప్పిన విధానం నాకు ఎంతో నచ్చింది' అని కార్తీక్ పేర్కొన్నాడు.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని గొప్ప లక్షణం కఠినమైన నిర్ణయాల నుంచి పారిపోకపోవడమేనని డీకే అభిప్రాయపడ్డాడు. 'నిజమైన నాయకుడు కఠిన నిర్ణయాలను తీసుకోవడమే కాదు.. వాటిని సంబంధిత వ్యక్తులకు నిజాయితీగా చెప్పగలగాలి. ప్రతి ఆటగాడికి తన స్థానం ఏంటో స్పష్టంగా తెలియజేయాలి. ధోనీలో నేను ఆ లక్షణాన్ని ప్రతిసారి చూశాను' అని చెప్పాడు. మైదానంలో వ్యూహాలతో మ్యాచ్‌లను గెలిపించడం మాత్రమే నాయకత్వం కాదని, ఆటగాళ్లలో నమ్మకాన్ని నిర్మించడం కూడా అంతే ముఖ్యమని కార్తీక్ వివరించాడు. జట్టులోని ప్రతి సభ్యుడితో స్పష్టంగా మాట్లాడటం, వారికి గౌరవం ఇవ్వడం ధోనీని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడాడు.

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక టైటిళ్లు గెలుచుకుంది. అయితే అతని విజయాల వెనుక ఉన్న నాయకత్వ నైపుణ్యాల్లో నిజాయితీ, స్పష్టత, ఆటగాళ్లపై నమ్మకం వంటి అంశాలే ప్రధానమని దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి. ధోనీ మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేశాడు. ఆసీస్ ఆధిపత్యం నడుస్తున్న రోజుల్లో టెస్టుల్లో టీమిండియాకు అగ్ర స్థానానికి చేర్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story