Mumbai Indians: ఆర్ఆర్‌తో భారీ ట్రేడ్ ప్లాన్.. హార్దిక్ పాండ్యను పంపేస్తున్న ముంబై ఇండియన్స్!

Mumbai Indians Trade Deal: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్ చర్చనీయాంశంగా మారింది.

Rishvik
Published on: 22 Jun 2026 5:25 PM IST
Mumbai Indians
X

Mumbai Indians: ఆర్ఆర్‌తో భారీ ట్రేడ్ ప్లాన్.. హార్దిక్ పాండ్యను పంపేస్తున్న ముంబై ఇండియన్స్!

Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్ న్యూస్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ) స్టార్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్య జట్టును వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండు సీజన్లలో నిరాశపరిచిన హార్దిక్.. కొత్త జట్టులో చేరాలని భావిస్తున్నాడని సమాచారం. మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) హార్దిక్‌ని ట్రేడ్ ద్వారా తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ముంబై, రాజస్థాన్ మధ్య చర్చలు:

హార్దిక్ పాండ్య ట్రేడ్ విషయంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి. అయితే హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఒక కీలక షరతు పెట్టినట్లు సమాచారం. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని ఎంఐ యాజమాన్యం కొరుకున్తుందట.

ఈ డీల్ కుదిరితే.. రాజస్థాన్‌కు హార్దిక్, ముంబైకి జైస్వాల్ ఆడుతారు. గత కొంతకాలంగా జైస్వాల్ భవిష్యత్తుపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టును వీడిన తర్వాత జైస్వాల్ భవిష్యత్తు కెప్టెన్‌గా ఎదుగుతాడని అందరూ భావించారు. అయితే ఫ్రాంచైజీ నాయకత్వ బాధ్యతలను రియాన్ పరాగ్‌కు అప్పగించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

తగ్గిన జైస్వాల్‌ ప్రభావం:

మరోవైపు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడం, పరుగుల వరద పారిస్తుండడంతో యశస్వి జైస్వాల్‌పై ఉన్న ప్రభావం కొంత తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్‌కు మారడం కెరీర్‌కు కొత్త ఊపునివ్వొచ్చని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముంబై రంజీ జట్టుకు ఆడే జైస్వాల్‌కు ఎంఐ ఫ్రాంచైజీ సొంత జట్టుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో రోహిత్ శర్మ తర్వాత ముంబై బ్యాటింగ్ విభాగానికి నాయకత్వం వహించే స్టార్‌గా అతడిని తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది.

సందిగ్ధంలో సూర్యకుమార్ భవిష్యత్తు:

ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ మరో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు కూడా సందిగ్ధంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్‌కు ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. హార్దిక్, సూర్యకుమార్ ఇద్దరూ జట్టును వీడితే.. ముంబై కొత్త తరం జట్టును నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రోహిత్ కెరీర్ చివరి దశకు చేరుకుంటుండగా.. హార్దిక్, సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో ముంబై కొత్త సూపర్ స్టార్ కోసం చూస్తోంది. అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదుగుతున్న జైస్వాల్ ఆ పాత్రకు సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు. అయితే ట్రేడ్ నిజంగా జరుగుతుందా?, జైస్వాల్‌కు ముంబై కెప్టెన్సీ కూడా ఆఫర్ చేస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రేడ్ వార్తలు ఐపీఎల్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story