Muttiah Muralitharan: ఇది యాపారం.. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ముఖ్యం, క్రికెట్ అభివృద్ధి కాదు!
Muttiah Muralitharan: ఐపీఎల్ 2026 సీజన్‌లో 200కు పైగా స్కోర్లు సాధారణమవుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Muttiah Muralitharan: ఇది యాపారం.. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ముఖ్యం, క్రికెట్ అభివృద్ధి కాదు!
Muttiah Muralitharan: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఐపీఎల్ 2021 నుంచే టీమ్స్ భారీ స్కోర్లు చేస్తున్నా.. అడపాదడపా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 30 సార్లకు పైగా రెండొందల స్కోర్లు నమోదవ్వడం విశేషం. 264, 244 పరుగుల లక్షాన్ని పంజాబ్, హైదరాబాద్ జట్లు ఈజీగా బాదేశాయి. దీంతో రన్స్ కాపాడడం బౌలర్లకు మరీ కష్టం అవుతోంది. వరుసగా భారీ స్కోర్లు నమోదవుతుండడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. 200కు పైగా స్కోర్లు సాధారణమవుతున్న నేపథ్యంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ పూర్తిగా వినోదం, వ్యాపార దృక్పథంతో నడుస్తోందన్నారు. క్రికెట్ అభివృద్ధి కంటే.. ప్రేక్షకుల ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల రోజుల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను ఉదాహరణగా తీసుకుంటే.. భారీ స్కోర్లు కూడా విజయాన్ని అందించలేవని స్పష్టమవుతోంది. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకుముందు రోజే పంజాబ్ కింగ్స్‌పై 200కు పైగా స్కోర్‌ను రాజస్థాన్ రాయల్స్ విజయవంతంగా ఛేజ్ చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధించడం ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఈ భారీ స్కోర్లపై స్పందించిన హైదరాబాద్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్.. బౌలర్లను తప్పుబట్టకూడదని స్పష్టం చేశారు. క్రికెట్ వృద్ధి కంటే.. అభిమానులను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం ముఖ్యమన్నారు. పవర్ ప్లేలో బ్యాటర్లు దూకుడుగా ఆడడం కూడా ఓ కారణమని ముత్తయ్య అభిప్రాయపడ్డారు.
'బౌండరీలు చిన్నగా ఉండటం వల్ల కాదు.. పిచ్‌ల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మంచి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై బ్యాటర్లు చెలరేగుతున్నారు. అప్పుడు అభిమానులు ఫోర్లు, సిక్సులను ఎంజాయ్ చేస్తారు. లేకపోతే మ్యాచ్ బోరింగ్‌గా మారుతుంది. బౌలర్లకు పెద్దగా సహకారం లభించడం లేదు. బౌండరీ సైజ్ కూడా చిన్నది కావడం వారికీ కష్టంగా మారింది. బౌలింగ్‌కు సహకరించేలా పిచ్‌ను సిద్ధం చేస్తే.. ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పిడు ఐపీఎల్ స్ట్రక్చర్ ఇలానే ఉంది. ఈ విషయంలో బౌలర్లను అస్సలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు' అని ముత్తయ్య మురళీధరన్ చెప్పారు.
'ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా భారీ స్కోర్లకు కారణమవుతోంది. అదనపు బ్యాటర్ అందుబాటులో ఉండటంతో జట్లు మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వినోదాన్ని కోరుకుంటున్నారు. అందుకే టోర్నీ నిర్మాణం కూడా అలానే ఉంది. స్పాన్సర్లు, ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండా ఉండేందుకు ఈ మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం క్రికెట్ కాకుండా.. పెద్ద వ్యాపారంగా మారింది' అని మురళీధరన్ పేర్కొన్నారు. అయితే బౌలర్లకు అవకాశాలు పూర్తిగా ముగిసిపోలేదని ఆయన చెప్పారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఈషాన్ మలింగ ప్రస్తుతం 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకోవడం దీనికి ఉదాహరణగా చూపారు. పరిస్థితులకు అనుగుణంగా బౌలర్లు తమ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటే.. మ్యాచ్‌పై ప్రభావం చూపగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బౌలర్లు తిరిగి తమ ఆధిపత్యాన్ని చాటే అవకాశాలు ఉన్నాయని మురళీధరన్ చెప్పుకొచ్చారు.




